Botsa Satyanarayana: అప్పుడు ఆంధ్రాలో లేడు... ఇప్పుడు ఇండియాలోనే లేడు: బొత్స

Botsa comments on Chandrababu foreign tour
  • విదేశాలకు వెళ్లిన సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు
  • చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారన్న బొత్స
  • చెబితే ఏం నష్టం జరుగుతుందని ఆశ్చర్యం

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార, విపక్ష నేతలు విదేశాల బాటపట్టడంపై స్పందించారు. చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పారా? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు? చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫలానా ఊరు వెళుతున్నానని చెబితే నష్టం ఏముందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని బొత్స స్పష్టం చేశారు. 

"చెప్పాల్సిన అవసరం లేదంటే... మరి మా నాయకుడు వెళ్లినప్పుడు ఎందుకు పోస్టింగులు పెట్టాలి? ఎందుకు  డిబేట్లు నిర్వహించాలి? ఇక రాడు... అక్కడే ఉంటాడు అంటూ  ఎందుకు ప్రచారం చేయాలి? మా నాయకుడికి వర్తించినప్పుడు మీ నాయకుడికి కూడా వర్తించదా? మీ నాయకుడు కూడా ఇక రాడు... అక్కడే ఉండిపోతాడు అని మేం అనలేమా? అప్పుడు ఐదేళ్లు ఆంధ్రాలో లేడు... ఏం జరిగినా హైదరాబాద్ పారిపోయేవాడు... ఇప్పుడు ఇండియాలోనే లేకుండా పోయాడు" అంటూ బొత్స విమర్శనాస్త్రాలు సంధించారు. 

అన్నీ తప్పుడు గణాంకాలే!

విద్య, వైద్య రంగంలో తాము కొనసాగిస్తున్న పథకాలనే మేనిఫెస్టోలో పెట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మా విధానాల్లో డొల్లతనం ఉందనుకుంటే, మా విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నారనుకుంటే కూటమి ఎందుకని మరింత మెరుగైన పథకాలను మేనిఫెస్టోలో పెట్టలేకపోయిందని ప్రశ్నించారు. 

దానికితోడు తప్పుడు గణాంకాలు విడుదల చేస్తున్నారని, 2019లో రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారని, అది  వాస్తవ విరుద్ధం అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు 38,61,198 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. కానీ పత్రికల్లో మాత్రం 35,69,506 మంది విద్యార్థులు ఉన్నారంటూ తప్పుడు కథనాలు వేశారని, ఇదంతా విద్యావిధానంలో లోపాల వల్లేనని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రతి విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి సన్నద్ధం చేస్తాం

ఏపీలో ప్రతి విద్యార్థి గ్లోబల్ స్థాయికి ఎదిగేలా నూతన విద్యావిధానం అమలు చేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్... వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఐబీ విద్యావిధానం... ఇలా అనేక విద్యా సంస్కరణలు తెచ్చామని చెప్పారు. 

పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. పేద విద్యార్థులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నామని, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నామని మంత్రి బొత్స వివరించారు.

  • Loading...

More Telugu News