Bison herd: క్లైమేట్ ఛేంజ్ పై పోరాడుతున్న 170 యూరోపియన్ అడవిదున్నలు!

Herd of 170 bison could help store CO2 equivalent of 43000 cars researchers say
  • 43 వేల కార్లు ఏటా విడుదల చేసే సీఓ2కు సమానమైన కార్బన్ భూమిలోంచి బయటకు రాకుండా సాయం
  • రొమేనియాలోని తార్కు పర్వతాల్లో చేపట్టిన తాజా పరిశోధనలో వెల్లడి
  • వాతావరణ మార్పులపై పోరులో జంతువులు కీలకపాత్ర పోషిస్తాయంటున్న శాస్త్రవేత్తలు

ఏటా అడవుల నరికివేత, ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందన్న విషయం తెలిసిందే. దీనివల్ల వాతావరణంలోకి భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలై భూమి వేడెక్కేందుకు కారణమవుతోంది. మరి క్లైమేట్ ఛేంజ్ ను ఎలా ఆపాలి? దీనిపై సైంటిస్టులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా వారికో సమాధానం దొరికింది.

రొమేనియాలోని తార్కు పర్వతాల్లో కేవలం 170 యూరోపియన్ అడవిదున్నలు భారీ స్థాయిలో కార్బన్ గాల్లో కలవకుండా చూస్తున్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఏటా అమెరికాలో 43 వేల కార్లు విడుదల చేసే సీఓ2కు సమానమైన కార్బన్ మట్టిలోనే ఉండిపోయేలా చేస్తున్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు.

యేల్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ కు చెందిన పరిశోధకులు రొమేనియాలోని తార్కు పర్వత ప్రాంతాలపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా యూరోపియన్ అడవిదున్నలు గడ్డి తింటున్న సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గడ్డి మైదానాలను పరిశీలించారు. అక్కడి మట్టి నమూనాలపై అధ్యయనం చేపట్టగా అందులో అదనంగా 54 వేల టన్నుల కార్బన్ నిల్వ అవుతోందట. అంటే ఏటా అమెరికాలో 43 వేల కార్లు లేదా యూరొప్ లో 1.23 లక్షల కార్లు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన కార్బన్ ఈ నేలలో నిల్వ ఉందట! ఇది ఈ ప్రాంతంలో అడవిదున్నలు లేకపోతే మట్టిలో నిల్వ అయ్యే కార్బన్ కు దాదాపు 10 రెట్లు ఎక్కువట!

గడ్డి మైదానాల్లో సమాంతరంగా గడ్డి తినడం ద్వారా అడవిదున్నలు అక్కిడి నేలలో పోషకాలు తిరిగి వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయట. అలాగే గిట్టలతో బలంగా అడుగులు వేయడం ద్వారా గడ్డి విత్తనాలు మట్టిలోకి వెళ్లి తిరిగి జీవం పోసుకొనేందుకు కారణమవుతున్నాయట. తద్వారా మట్టిలో నిల్వ ఉన్న కార్బన్ వాతావరణంలోకి విడుదల కాకుండా చూస్తున్నాయట. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాల్డ్ ష్మిట్జ్ ఈ వివరాలను వెల్లడించారు.

 ఏనుగులు, తోడేళ్లు, వైల్డ్ బీస్ట్ లు, షార్క్ లు, తిమింగలాలు లాంటి 9 రకాల జంతువులు, సముద్ర జీవులను కాపాడటం, వాటి సంతతి పెంచడం ద్వారా భూమిపై ఏటా అదనంగా 640 కోట్ల టన్నుల కార్బన్ వాతావరణంలో కలవకుండా నివారించొచ్చని ఇప్పటికే ఈ పరిశోధకులు గుర్తించారు.

రొమేనియాలో సుమారు 200 ఏళ్ల కిందటే యూరోపియన్ జాతి అడవిదున్నలు కనుమరుగు అయ్యాయి. అయితే వాటిని 2014లో తిరిగి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వాటి సంతతి 170కి చేరుకుంది.  తార్కు పర్వత ప్రాంతం సుమారు 450 అడవిదున్నలు నివసించేందుకు వీలుగా ఉన్నట్లు శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News