Shubman Gill: ఐపీఎల్‌ నుంచి గుజ‌రాత్ నిష్క్ర‌మ‌ణ‌.. ఫ్యాన్స్‌కు కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్ రాసిన నోట్ వైర‌ల్‌!

Shubman Gill Pens Down Heartfelt Note For Fans As Campaign Ends For Gujarat Titans Following Washout in SRH vs GT IPL 2024 Match
  • స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌ర‌గాల్సిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
  • నిరాశ‌తో సీజ‌న్‌ను ముగించిన గుజ‌రాత్ టైటాన్స్
  • ఈ నేప‌థ్యంలో త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చిన అభిమానుల‌కు సార‌ధి గిల్ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌  

ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజ‌రాత్ టైటాన్స్ క‌థ ముగిసింది. గురువారం స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌ర‌గాల్సిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. జీటీ అంత‌కుముందు మ్యాచ్ కూడా ఇలాగే వ‌ర్షార్ప‌ణం అయింది. దీంతో ఈ సీజ‌న్‌లో కేవ‌లం 12 మ్యాచులే ఆడింది. ఐదు విజ‌యాలు సాధించింది. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన రెండు మ్యాచుల్లో చెరో పాయింట్‌తో క‌లిపి టైటాన్స్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశం లేదు. చివ‌రి మ్యాచులోనైనా విజ‌యంతో సీజ‌న్‌ను ముగించాల‌నుకున్న గుజ‌రాత్ ఆశ‌ల‌కు వ‌రుణుడి వ‌ల్ల గండిప‌డింది. ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన అభిమానుల‌ను ఉద్దేశించి ఎక్స్ వేదిక‌గా ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

"మేము ఆశించిన విధంగా ఈసారి టోర్నీని ముగించ‌లేకపోయాం. కానీ ఈ సీజ‌న్ నుంచి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకోవడం జ‌రిగింది. అలాగే కొన్ని గొప్ప జ్ఞాపకాలతో నిండిన సీజన్ ఇది. నేను మూడు సంవత్సరాలుగా ఈ అందమైన కుటుంబంలో భాగమయ్యాను. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని ప్రయాణం. కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదరించి, ప్రేమను చూపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ సార‌ధి గిల్ త‌న నోట్‌లో రాసుకొచ్చాడు. ఇప్పుడీ పోస్ట్‌ను జీటీ అభిమానులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే.. ఈ ఏడాది హార్దిక్ పాండ్యా గుజ‌రాత్ టైటాన్స్‌ను వ‌దిలి తిరిగి ముంబై ఇండియ‌న్స్‌కు వెళ్ల‌డంతో శుభ్‌మ‌న్ గిల్‌కు తొలిసారి జ‌ట్టు ప‌గ్గాలు ద‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ యువ ఆట‌గాడు జ‌ట్టును అంత స‌మ‌ర్థ‌వంతంగా న‌డ‌ప‌లేక పోయాడ‌నేది క్రికెట్ విశ్లేష‌కుల అభిప్రాయం. ఇంత‌కుముందు పాండ్యా కెప్టెన్సీలో జీటీ వ‌రుస‌గా రెండుసార్లు ఫైన‌ల్‌కి వెళ్ల‌గా.. ఈసారి లీగ్ ద‌శ‌లోనే జ‌ర్నీని ముగించాల్సి వ‌చ్చింది. ఇక గుజ‌రాత్ తాను ఆడిన మొద‌టి ఐపీఎల్‌ (2022) లోనే టైటిల్ విజేత‌గా నిలిచి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News