Swati Maliwal: చాలా దురదృష్టకరం.. తనపై దాడి ఘటనపై ఎట్టకేలకు నోరు విప్పిన స్వాతి మలివాల్

MP Swati Maliwal Reaction On Assault Row
  • ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానన్న ఎంపీ
  • పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడి
  • ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ బీజేపీ నేతలకు విజ్ఞప్తి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. సీఎం నివాసంలో స్వాతి మలివాల్ పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

‘దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు. దీనిపై నా క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించిన వారికీ దేవుడు మంచి చేయాలనే కోరుకుంటున్నా’ అంటూ స్వాతి మలివాల్ గురువారం ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేస్తూ.. తనపై జరిగిన దాడిని రాజకీయం చేయొద్దని బీజేపీ నేతలకు స్వాతి మలివాల్ విజ్ఞప్తి చేశారు.

స్టేట్ మెంట్ లో ఏముందంటే..
సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్లిన ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగింది. సీఎం పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వైభవ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. చెంపపై కొట్టడంతో పాటు పొట్టలో కాలితో తన్నాడు. కర్రతో కొట్టాడని ఎంపీ స్వాతి మలివాల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అతని దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డ ఎంపీ.. అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం పోలీస్ లైన్స్ లోని స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. వైద్య పరీక్షలు చేయించాలని చెప్పడంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తానని వెళ్లిపోయారు. ఎంపీ స్వాతి మలివాల్ చెప్పిన వివరాలతో స్టేట్ మెంట్ రికార్డు చేసి దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డీసీపీ మీనా తెలిపారు. సీఎం కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్ కు నోటీసులు పంపించినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News