PhonePe: శ్రీలంక వెళ్లే భార‌త టూరిస్టుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆ దేశంలోనూ ఫోన్ పే సేవ‌లు!

PhonePe launches cross border UPI payments in Sri Lanka
  • లంకాపేతో క‌లిసి సేవ‌ల్ని ప్రారంభించిన ఫోన్ పే
  • భార‌తీయులు వారి ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేసే వెసులుబాటు
  • ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక ఆర్థిక భాగ‌స్వామ్యాన్ని ఈ చ‌ర్య‌ మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌న్న భారత హైకమిషనర్

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీ సంస్థ ఫోన్ పే శ్రీలంక‌లో సేవ‌ల్ని ప్రారంభించింది. శ్రీలంక‌లోని లంకాపేతో క‌లిసి ఈ సేవ‌ల్ని అందించ‌నున్న‌ట్లు ఫోన్ పే బుధ‌వారం ప్ర‌క‌టించింది. భార‌తీయులు వారి ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేయొచ్చ‌ని తెలిపింది. శ్రీలంక అంతటా యూపీఐని ఉపయోగించి చెల్లించడానికి దాని వినియోగదారులను అనుమతిస్తుందని తెలిపింది. ఇక‌పై శ్రీలంక వెళ్లే భార‌త టూరిస్టులు న‌గ‌దును వెంటే తీసుకెళ్ల‌న‌క్క‌ర్లేద‌ని ఫోన్ పే పేర్కొంది. అంతేగాక కరెన్సీ మారకం రేటును చూపుతూ, మొత్తం ఐఎన్ఆర్‌ (భారత రూపాయి)లో డెబిట్ అవుతుందని చెప్పింది.  

శ్రీలంక వెళ్లే భారతీయ పర్యాటకులు ఇప్పుడు సుపరిచితమైన, సురక్షితమైన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి లావాదేవీలు చేసుకోవ‌చ్చ‌ని ఫోన్ పే ఇంటర్నేషనల్ పేమెంట్స్ సీఈఓ రితేష్ పాయ్ తెలిపారు. లంకాపే సహకారంతో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నామ‌న్నారు. 

లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ.. "భారతీయ పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణికులకు శ్రీలంకలో ఉన్న సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశ‌గా కీల‌క అడుగు ప‌డింది. ఫోన్ పేతో క‌లిసి వారికి ఈ సౌక‌ర్యాన్ని అందించ‌డం ప‌ట్ల‌ మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు. 

అటు ఈ సహకారాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (సీబీఎస్ఎల‌) గవర్నర్ నందలాల్ వీరసింగ్ కూడా ప్రస్తావించారు. ఈ చర్య కొత్త అవకాశాలను అన్‌లాక్ చేస్తుందన్నారు. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపారు.

శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా మాట్లాడుతూ, రెండు దేశాల మ‌ధ్య‌ యూపీఐ సేవ‌లు ప్రారంభం కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక ఆర్థిక భాగ‌స్వామ్యాన్ని ఈ చ‌ర్య‌ మ‌రింత బ‌లొపేతం చేస్తుంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News