Botsa Satyanarayana: వైసీపీకి నేను రాజీనామా చేశానని తప్పుడు ప్రచారం చేయించారు: బొత్స సత్యనారాయణ

TDP spread false news on me says Botsa
  • విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారన్న బొత్స
  • మహిళల ఓట్లు వైసీపీకే పడ్డాయని వ్యాఖ్య
  • చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న బొత్స

జూన్ 4న ఊహించని ఫలితాలు రాబోతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పోలింగ్ జరిగిన సరళిని చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని అనిపిస్తోందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని... రెండు, మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తామని అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, హామీల అమలు ముఖ్యమని... జగన్ అత్యున్నత విలువలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలోని మహిళల మద్దతు జగన్ కే ఉందని బొత్స చెప్పారు. మహిళల ఓట్లు వైసీపీకే పడ్డాయని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి మహిళ వైసీపీకే ఓటు వేశారని చెప్పారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు నమ్మారని...ఆ నమ్మకంతోనే వైసీపీకి ఓటు వేశారని అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన స్థాయికి తగని భాషను వాడారని బొత్స మండిపడ్డారు. కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారని విమర్శించారు. పోలింగ్ కు ముందు రోజు తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు యత్నించారని అన్నారు. పోలింగ్ రోజున కూడా వైసీపీ శ్రేణులపై దాడులు చేయించారని మండిపడ్డారు.  

టీడీపీ ఓటమి ఖాయమయిందని... చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని బొత్స అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడిస్తారని... వైసీపీ శ్రేణులు ఎవరూ ఉద్రిక్తతలకు గురి కావొద్దని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించబోమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News