Stephen fleming: టీమిండియా హెడ్ కోచ్ ఇతడేనా?

BCCI mulls foreign head coach approaches Stephen Fleming Tom Moody
  • టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్, టామూ మూడీ పేర్లు
  • స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగీకరిస్తే ముందుకెళ్లే యోచనలో బీసీసీఐ
  • సీఎస్‌కే కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అద్భుత ట్రాక్ రికార్డు
  • ధోనీతో కలిసి సీఎస్‌కేను విన్నింగ్ టీంగా తీర్చిదిద్దిన వైనం

టీమిండియా హెడ్ కోచ్‌గా ఓ విదేశీయుడిని నియమించాలని బీసీసీఐ యోచిస్తోందా? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్‌లో ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎస్ఆర్‌హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ పేర్లను పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయమై స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను సంప్రదించిందట. ఈ బాధ్యతలకు అతడు సుముఖంగా ఉంటే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చన్న యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. 

కొత్త కోచ్ పదవికి బీసీసీఐ మే 13న దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. మే 27లోపు దరఖాస్తులు అందాలని డెడ్‌లైన్ విధించింది. అయితే, హెడ్ కోచ్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు మొదలయ్యే లోపే స్టీఫెన్ ఫ్లెమింగ్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

కోచ్‌గా ఫ్లెమింగ్ అద్భుత రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీఎస్‌కేను విజయాల దిశగా నడిపించడంలో ధోనీతో కలిసి ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ధోని ప్యాప్యులారిటీ స్థాయి ముందు ఫ్లెమింగ్ పాత్రకు అంత గుర్తింపు రాలేదు. మరోవైపు, 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీంకు టామ్ మూడీ  కోచ్‌గా చేశాడు. ఇక టీమిండియా జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేసిన చివరి విదేశీయుడు డంకన్ ఫ్లెచర్. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ ఓడిన అనంతరం అతడు కోచ్‌గా తప్పుకున్నాడు. కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ మిగిల్చిన చేదు అనుభవాలతో టీమిండియా చాలా కాలం పాటు విదేశీ కోచ్‌లను దూరంగా ఉంచింది. అయితే, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గారీ క్రిస్టెన్ రాకతో పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపించింది. అతడి మార్గదర్శకత్వంలో టీమిండియా 2011 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. క్రిస్టెన్ పాక్ టీంకు కూడా కోచ్‌గా సేవలందించారు.

  • Loading...

More Telugu News