Arvind Kejriwal: చీపురు గుర్తుకు ఓటేస్తే నేను తిరిగి జైలుకు వెళ్లక్కర్లేదు: కేజ్రీవాల్

Wont Have To Go Back To Jail If You Choose AAP Says Kejriwal
  • ఢిల్లీ ఓటర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సూచన
  • మీకోసం పనిచేస్తున్నాననే బీజేపీ నన్ను జైల్లో పెట్టిందని ఆరోపణ
  • తాను జైలుకు వెళ్లిపోతే పనులన్నీ ఆగిపోయి మీరే ఇబ్బంది పడతారని హెచ్చరిక

‘ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది.. ఎన్నికలు పూర్తయ్యాక నేను తిరిగి జైలుకు వెళ్లకుండా మీ ఓటే నన్ను కాపాడుతుంది. పోలింగ్ బూత్ లలో మీరు చీపురు గుర్తును ఎంచుకుంటే నేను జైలుకు వెళ్లక్కర్లేదు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేజ్రీవాల్ ప్రసంగించారు. ప్రజల కోసం పనిచేస్తున్నాననే కోపంతోనే బీజేపీ తనను జైలుకు పంపించిందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి జైలులో కూర్చోబెట్టినా తన ఆలోచనలు ప్రజల చుట్టూనే తిరుగుతున్నాయని వివరించారు. ఉచిత కరెంట్, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్ లతో వైద్యం.. సహా ప్రజల కోసం ఎన్నో చేస్తున్నానని వివరించారు. తాను తిరిగి జైలుకు వెళితే ఈ పనులన్నీ ఆగిపోతాయని, బీజేపీ మిమ్మల్ని పట్టించుకోదని హెచ్చరించారు.

సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, మెరుగైన విద్య, వైద్యం అందాలన్నా తాను బయటే ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిశాక తిరిగి జైలుకు వెళ్లాలని కోర్టు తనను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తాను జైలుకు వెళ్లకుండా అడ్డుకునే శక్తి మీకు మాత్రమే ఉందని ఢిల్లీ ఓటర్లకు చెప్పారు. చీపురు గుర్తుకు ఓటేస్తే తాను జైలుకు వెళ్లక్కర్లేదని చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలుపాలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన కేజ్రీవాల్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది.

  • Loading...

More Telugu News