Pavitra Jayaram: మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... టీవీ నటి పవిత్ర దుర్మరణం

TV actress Pavitra died in a road accident
  • త్రినయని సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర
  • బెంగళూరు నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం
  • మహబూబ్ నగర్ జిల్లా శేరిపల్లి వద్ద ఘటన
  • పవిత్ర మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జీ తెలుగు చానల్ యాజమాన్యం

త్రినయని సీరియల్ లో 'తిలోత్తమ'గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. 

ఈ వేకువ జామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నెం.44పై భూత్ పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద రోడ్డు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు. పవిత్ర మృతి చెందగా, కుటుంబ సభ్యులకు, చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. 

పవిత్ర జయరామ్ కర్ణాటకకు చెందిన నటి. ఆమె టీవీ సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పవిత్ర మృతితో తెలుగు, కన్నడ టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. 

జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే 'త్రినయని' సీరియల్ లో పవిత్ర 'తిలోత్తమ' అనే నెగెటివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ, ఆమెకు ఈ పాత్ర ద్వారా ఎంతోమంది అభిమానులయ్యారు. 

పవిత్ర రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం పట్ల జీ తెలుగు టీవీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతి తీరని లోటు అని, 'తిలోత్తమ'గా ఆమె స్థానంలో ఇంకెవరినీ ఊహించుకోలేమని జీ తెలుగు చానల్ పేర్కొంది. ఆమె మృతి పట్ల జీ తెలుగు కుటుంబం చింతిస్తోందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News