Sourav Ganguly: రిషబ్ పంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయించేందుకు గంగూలీ మాస్టర్ ప్లాన్

  • సంజూ శాంసన్ వివాదాస్పద ఔట్ పరిశీలనకు ఎక్కువ సమయం తీసుకున్నారన్న గంగూలీ
  • రాజస్థాన్ ప్లేయర్లు 13 సిక్సర్లు కొట్టగా మూడు సందర్భాల్లో బంతి ఆలస్యంగా బౌలర్ చేతికొచ్చిందని వెల్లడి
  • చివరిలో ఢిల్లీ బౌలర్లు ఎక్కువ వైడ్లు వేశారన్న రికీ పాంటింగ్
  • బౌలర్ల తప్పిదానికి కెప్టెన్‌పై నిషేధం సరికాదని వాదన
  • ఇరువురి వాదనలనూ తిరస్కరించిన బీసీసీఐ విచారణ ప్రతినిధి
Sourav Ganguly Masterplan To Reverse Rishabh Pant Ban but Rejected By IPL

ఐపీఎల్ 2024లో మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిషేధంతో పాటు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో స్లో ఓటర్ రేట్ కారణంగా పంత్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన మ్యాచ్‌లు జరగనున్న దశలో పంత్‌పై నిషేధం పడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

పంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అప్పీలుకు వెళ్లింది. విచారణ సమయంలో ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మాస్టర్ ప్లాన్‌తో వాదించినప్పటికీ ఫలితం దక్కలేదని బీసీసీఐ విచారణ సభ్యుడు విడుదల చేసిన డాక్యుమెంట్ స్పష్టం చేసింది. 
 
రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్ వివాదాస్పద ఔట్ కారణంగా సమయం వృథా అయ్యిందని గంగూలీ వాదించాడు. బౌండరీ లైన్‌ దగ్గర ఢిల్లీ ప్లేయర్ షాయ్ హోప్ పట్టిన క్యాచ్ పరిశీలనకు ఎక్కువ తీసుకున్నారని ప్రస్తావించాడు. శాంసన్‌ ఔట్‌పై రివ్యూకు 3.0 నిమిషాలు కేటాయించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ టైమ్ తీసుకున్నారని గంగూలీ పేర్కొన్నాడు. దీనిపై శాంసన్ మైదానంలోనే నిరసన వ్యక్తంచేసిన విషయాన్ని గుర్తుచేశాడు. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ 13 సిక్సర్లు కొట్టారని, సిక్స్ కొట్టినప్పుడు 0.30 నిమిషాల్లోపే అందాల్సిన బంతి మూడు సందర్భాల్లో అందలేదని గంగూలీ పేర్కొన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇన్నింగ్స్ చివరిలో అనేక వైడ్ బాల్స్ వేశారని, స్లో ఓవర్ రేట్‌కు ఇది కూడా ఒక కారణమని జట్టు కోచ్ రికీ పాంటింగ్ వాదించాడు. స్పిన్నర్లను ఉపయోగించి స్లో ఓవర్ రేట్‌ని తగ్గించే ప్రయత్నం చేశామన్నాడు. బౌలర్ల కారణంగా ఉత్పన్నమైన స్లో ఓవర్ రేట్‌కి కెప్టెన్ పంత్‌పై నిషేధం విధించడం తగదని వాదించాడు. అయితే సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్‌ల వాదనలను బీసీసీఐ విచారణ ప్రతినిధి తిరస్కరించారని డాక్యుమెంట్ పేర్కొంది.

స్లో ఓవర్ రేట్‌పై విచారణకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున జట్టు సీఈవో సునీల్ గుప్తా, కెప్టెన్ రిషబ్ పంత్, డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, కోచ్ రికీ పాంటింగ్‌ హాజరయ్యారు. బీసీసీఐ తరపున బీసీసీఐ సీఈవో హేమంగ్ అమీన్, మ్యాచ్ రిఫరీ డేనియల్ మనోహర్ హాజరయ్యారని విచారణ డాక్యుమెంట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News