Iran: అణు బాంబు తయారీపై నిర్ణయించుకోలేదు.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక

Iran gives Big Nuclear Bomb Warning To Israel Amid Tensions
  • ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే బాంబు తయారు చేయడమే మార్గమని వార్నింగ్
  • తమ అణుకేంద్రాలపై దాడి చేస్తే ఆలోచన మారుతుందని వ్యాఖ్య
  • ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అధినేత అయతుల్లా సలహాదారు ఆసక్తికర వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖర్రాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణుబాంబు తయారు చేయాలనే నిర్ణయం తీసుకోలేదని, అయితే ఇరాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే వేరే మార్గం ఉండబోదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ముప్పు ఉందని పసిగడితే పరిస్థితులకు అనుగుణంగా ఇరాన్ అణు సిద్ధాంతం, సైనిక సిద్ధాంతాలు మారతాయని అన్నారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కమల్ ఖర్రాజీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బయటి దేశాలు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుంచి తమపై ఒత్తిడి పెరిగితే అణ్వాయుధాల అభివృద్ధిని తిరిగి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. ఇజ్రాయెల్ తమ అణు కేంద్రాలపై దాడి చేస్తే తమ ఆలోచన మారుతుందని ఖర్రాజీ హెచ్చరించారు. కాగా ఇరాన్‌తో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రతినిధుల చర్చలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తున్నట్టుగా 2021లో ఇరాన్ ఫత్వా జారీ చేసింది. అయితే అణు కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఈఏ షరతులను ఇరాన్ పూర్తిగా పాటించలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

కాగా ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై బాంబు దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ చెబుతోంది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, మిసైల్స్‌ కూడా ప్రయోగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News