Kolkata Knight Riders: ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా ఘనవిజయం.. ప్లే ఆఫ్స్‌లోకి అడుగు

Kolkata Knight Riders Entered playoff qualification with thrilling win over Mumbai Indians
  • 18 పరుగుల తేడాతో విక్టరీ
  • సమష్టిగా చెలరేగిన కోల్‌కతా బౌలర్లు
  • ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన కోల్‌కతా

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 158 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఆరంభంలో ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడినప్పటికీ చివరివరకు కొనసాగించలేకపోయారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 7 ఓవర్లలో 65 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఇషాన్ 22 బంతుల్లో 40 పరుగులు బాదడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించినట్టే కనిపించింది. కానీ ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్య్రూ రస్సెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.

కాగా వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ఆరంభమవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్‌ వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆదుకున్నారు. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు బాది ఆ జట్టు భారీ స్కోర్ సాధించడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత నితీశ్ రాణా (33), రస్సెల్స్ (24), రింకూ సింగ్ (20) చొప్పున కీలకమైన పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, చావ్లా చెరో రెండు వికెట్లు, ఎన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.


  • Loading...

More Telugu News