Rahul Gandhi: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్... వీళ్ల రిమోట్ మోదీ చేతిలో ఉంది: కడపలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Rahul Gandhi comments on AP politics
  • కడపలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ
  • హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
  • ఏపీని బీజేపీ బి-టీమ్ నడిపిస్తోందని వెల్లడి
  • ఏపీ నేతలు మోదీకి భయపడుతున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత
  • ఎందుకంటే మోదీ చేతిలో ఈడీ, సీబీఐ ఉన్నాయని వ్యాఖ్యలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అని వెల్లడించారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని నాడు వైఎస్సార్ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

వైఎస్సార్ వంటి నేత రాష్ట్రానికే కాదు, దేశానికే స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, వైఎస్సార్ సోదరుల్లా మెలిగారని వివరించారు. ఏపీలో వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం, సంక్షేమం కోసం రాజకీయాలు చేశారని, పేదల కోసం రాజకీయాలు చేశారని, ఏపీలో ఇప్పుడలాంటి రాజకీయం లేదని అన్నారు. 

ఏపీని ఇప్పుడు బీజేపీ బి-టీమ్ నడిపిస్తోందని విమర్శించారు.  ఏపీలో బీజేపీ బి-టీమ్ అంటే బాబు, జగన్, పవన్ అని అభివర్ణించారు. ఈ ముగ్గురి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతిలో ఉందని అన్నారు. వీళ్ల రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఎందుకు ఉందో అందరికీ తెలుసని, ఎందుకంటే మోదీ చేతిలో ఈడీ, సీబీఐ ఉన్నాయని, అందుకే వీరంతా మోదీ చెప్పుచేతల్లో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

బాధాకరమైన విషయం ఏమిటంటే... ఏపీ ప్రజల ఆకాంక్షలు ఢిల్లీలో వినిపించడంలేదని, వాటి గొంతు నొక్కేశారని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నికార్సయిన కాంగ్రెస్ వాది అని, జీవితమంతా బీజేపీని వ్యతిరేకించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. 

కానీ ఆయన వారసుడు జగన్ బీజేపీపై ఎలాంటి పోరాటం చేయడంలేదని, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఆరోపించారు. ఎందుకంటే జగన్ పై అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఒక్క మాట కూడా అనలేరని విమర్శించారు. చంద్రబాబుకు కూడా ఇదే అలవాటు ఉందని అన్నారు. 

"నాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పటిదాకా అవి నెరవేరలేదు. మీకు ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? ఎందుకంటే... ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ముందు తలవంచింది. అవినీతి కూపంలో మునిగిపోయిన వీళ్లు కేంద్రాన్ని ఏం ప్రశ్నిస్తారు? 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తాం" అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News