JP Nadda: ఏపీ ప్రజల ఆశీర్వాదాలు కూటమికే: తిరుపతి రోడ్ షోలో జేపీ నడ్డా

JP Nadda confidant on NDA Alliance victory in AP
  • తిరుపతిలో ఎన్డీయే కూటమి భారీ రోడ్ షో
  • హాజరైన జేపీ నడ్డా, నారా లోకేశ్, నాగబాబు
  • ఏపీలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా నడుస్తున్నాయన్న నడ్డా
  • ప్రజల ఉత్సాహం చూస్తుంటే కూటమి విజయం ఖాయమని ధీమా

తిరుపతిలో ఇవాళ ఎన్డీయే కూటమి భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఈ రోడ్ షోలో నడ్డా మాట్లాడుతూ, ఏపీలో మాఫియాలదే రాజ్యమని అన్నారు. ఇసుక, మద్యం, భూ మాఫియాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజల ఆశీర్వాదాలు ఎన్డీయే కూటమికేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఉత్సాహం చూస్తుంటే  కూటమి విజయం ఖాయమని తెలుస్తోందని అన్నారు. 

తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరమని, ప్రధాని మోదీ తిరుపతిని ఐటీ నగరంగానూ అభివృద్ధి చేస్తారని నడ్డా స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం మోదీ ఎంతో శ్రమిస్తున్నారని, తిరుపతి ఐటీ నగరంగా రూపుదాల్చితే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 

భూమన కుటుంబానికి డబ్బులు ఇస్తేకానీ పనులు జరగడంలేదు: నారా లోకేశ్

తిరుపతి రోడ్ షోలో నారా లోకేశ్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎటు చూసినా భూ దందాలు, కబ్జాలేనని ఆరోపించారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా భూమన కుటుంబానికి డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనని అన్నారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి, ఇతర రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకువచ్చామని వివరించారు. కానీ జగన్ నిర్వాకంతో ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని, కొత్త కంపెనీల జాడే లేదని లోకేశ్ మండిపడ్డారు. జగన్ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News