Revanth Reddy: నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తారా? నా చరిత్ర తెలుసుకో: ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • డీకే అరుణను పక్కన పెట్టుకొని నన్ను అవమానిస్తారా? అని ఆగ్రహం
  • పాలమూరు ప్రజల్ని, నా కుటుంబాన్ని, నా కార్యకర్తల్ని అవమానించినట్లేనని వ్యాఖ్య
  • దేవుడి పేరు మీద బిచ్చమెత్తుకొని ఓట్లు అడుక్కుంటున్నారని ఆగ్రహం
CM Revanth Reddy fires at PM Modi in Gadwal

డీకే అరుణను పక్కన పెట్టుకొని... నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తావా? ఇది నీకు న్యాయమా? ధర్మమా? డీకే కుటుంబం చరిత్ర... నా చరిత్ర తెలుసుకో... అని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్‌లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డీకే అరుణను ప్రజలు గుర్తుపట్టడానికి కారణం కాంగ్రెస్సే అన్నారు. కానీ ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తా అంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ డీకే అరుణను నమ్ముకొని తనను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణపేటకు వచ్చిన ప్రధాని మోదీ మనకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. జిల్లాకు వచ్చి ఏమైనా నిధులు, ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించానని.. కానీ ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషీ కాదన్నారు. పదేళ్లలో ఏమీ ఇవ్వనందుకు ప్రధాని మోదీ పాలమూరుకు వచ్చి క్షమాపణలు చెబుతాడని భావించానని కానీ అలా జరగలేదన్నారు. పైగా తనను విమర్శించారన్నారు. తాను కష్టపడి కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగానన్నారు. అలాంటి తనను 'నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా?' అని ప్రధానిపై మండిపడ్డారు.

ఇక్కడి ప్రజలను డీకే కుటుంబం గురించి అడగండి... తన గురించి అడగండని ప్రధానికి సూచించారు. తన చరిత్ర గురించి ఎవరైనా తప్పుగా చెబితే షాద్ నగర్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. డీకే కుటుంబం గురించి చెబితే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై ఆషామాషీగా విమర్శలు చేస్తారా... మీ గౌరవానికి, హోదాకు మంచిది కాదని ప్రధానికి హితవు పలికారు. 

పాలమూరు జిల్లాకు వచ్చి తనను విమర్శించడమంటే తనను ఈ సీఎం పీఠంపై కూర్చోబెట్టిన కార్యకర్తలను అవమానించినట్లేనన్నారు. నా పాలమూరు బిడ్డలను... నా కుటుంబ సభ్యులనూ అవమానించినట్లే అన్నారు. 'మీరు ఈ దేశ ప్రధాని.. ఆరోపణ చేసే సమయంలో అన్నీ చూసుకోవాలి. అందరి చరిత్ర చూడాలి.. కనుక్కోండి' అని పేర్కొన్నారు. తులసివనం వంటి పాలమూరులో గంజాయి మొక్క వంటి గడీల పాలన కలిసిందన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి

బీఆర్ఎస్ కార్యకర్తలారా... కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీ వద్ద మిమ్మల్ని తాకట్టు పెడుతున్నారని తెలుసుకోవాలని సూచించారు. చీకటి అయితే వాడే వీడు... వీడే వాడు... బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ దగాకోరు రాజకీయాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేవుడి పేరు మీద బిచ్చమెత్తుకొని ఓట్లు అడుక్కుంటున్నారు

బీజేపీ వాళ్లు దేవుడి పేరు మీద బిచ్చమెత్తుకొని ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలని పునరుద్ఘాటించారు. అలాంటి వాడే అసలైన హిందువు అని... మతసామరస్యాన్ని కాపాడుతాడన్నారు. కానీ దేవుడిని తీసుకువచ్చి షాద్ నగర్ బస్టాండ్‌లో పళ్లెంలో పెట్టినవాడు హిందువు ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు. బీజేపీ ఇక్కడ మతవిద్వేషాలు రెచ్చగొట్టి... ఆరేడు ఎంపీలు గెలిస్తే... మళ్లీ తెలంగాణలో చిచ్చు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? మన బతుకులు ఏం కావాలి? మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? అని ప్రశ్నించారు.

70 ఏళ్ల తర్వాత మళ్లీ మహబూబ్ నగర్ జిల్లా బిడ్డకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. సమైక్యాంధ్ర పాలకులు పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారని విమర్శించారు. సమైక్య పాలకుల కంటే పాలమూరుకు కేసీఆర్ ఎక్కువ అన్యాయం చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News