Nara Rohith: జగన్ రెడ్డి పాలనలో అప్పులు పెరగడానికి కారణం అదే: నారా రోహిత్

Nara Rohith press meet in Kotha Cheruvu
  • ఏపీలో ఎన్డీయే కూటమి తరఫున నారా రోహిత్ ప్రచారం
  • నేడు సత్యసాయి జిల్లాలో పర్యటన
  • అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్య 
  • ఆదాయం ఉంటేనే అప్పు చేయకుండా సంక్షేమం అందించగలమని వివరణ

ఎన్డీయే కూటమి గెలుపే లక్ష్యంగా ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడారు. 

"రాష్ట్రం విడిపోయింది, మనకు రాజధాని లేదు, కానీ చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని మనం కళ్లారా చూశాం. అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, యువత జీవితాలు బాగుపడతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఎన్డీఏ మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభించింది. కచ్చితంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. 

రాష్ట్రానికి కియా లాంటి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. తద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం ఉంటేనే అప్పు చేయకుండానే ప్రజలకు సంక్షేమాన్ని అందించగలం.

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఆదాయం లేదు. పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమం అందించడం అంటే ప్రజలపై అప్పుల భారం మోపినట్లే..! 

ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దారుణంగా వెనుకబడిపోయింది. చంద్రబాబు చేసిన అభివృద్ధి నిలిచిపోయింది.  కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు. అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చేసి దమనకాండను మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకర యాక్ట్‌ను తీసుకువచ్చారు. దాని వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. 

ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. రాష్ట్ర భవిష్యత్తును ప్రజలే రాయగలరని నమ్ముతున్నాను. ప్రజాక్షేత్రానికి జర్నలిస్టు అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరఫు నుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమైనది.

'ప్రతినిధి-2' సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ఎలా మార్చగలమో ప్రతినిధి-2 ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాం. ప్రతినిధి-2 సినిమా చూస్తే ఓటు ఎంత ముఖ్యమైనదో ప్రజలకు తెలియజేస్తున్నాం” అని నారా రోహిత్ అన్నారు.

  • Loading...

More Telugu News