Chandrababu: ప్రతికూల వాతావరణం... మాచర్ల సభకు రాలేకపోయిన చంద్రబాబు... వీడియో ద్వారా ప్రసంగం

  • ఇవాళ చంద్రబాబు షెడ్యూల్ లో ఐదు సభలు
  • వర్షంలోనే గన్నవరం సభలో పాల్గొన్న చంద్రబాబు
  • మాచర్ల సభకు వచ్చేందుకు ప్రకృతి అనుకూలించలేదని చంద్రబాబు విచారం
  • ఈ రాత్రికి ఒంగోలు సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
Chandrababu video speech for Macherla rally

టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు రాలేకపోయారు. ఇవాళ ఆయన ఉండి, ఏలూరు, గన్నవరం సభల్లో పాల్గొన్నారు. అయితే, సాయంత్రం మాచర్లలో, రాత్రికి ఒంగోలు సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో మాచర్ల సభను ఉద్దేశించి చంద్రబాబు వీడియో ద్వారా ప్రసంగించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మాచర్లకు రాలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. 

"ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఉంటారని తెలుసు... మాచర్ల రాలేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది... నా మనసంతా అక్కడే ఉంది. ఎన్నికల ముందు మాచర్ల వచ్చి మీకు భరోసా ఇవ్వాలనుకున్నాను. అధికారంలోకి వచ్చాక ఏమేం చేస్తామో మీతో చెప్పాలని అనుకున్నాను. కానీ ఇవాళ ప్రకృతి సహకరించలేదు. 

ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు, అభినందనలు. మీలో ఐదేళ్ల పాలనపై కసి ఉంది, ఆవేదన ఉంది, దెబ్బకొట్టాలనే ఆవేశం ఉంది. అందుకే ఇవాళ మాచర్లలో నేడు ఒక తిరుగుబాటు కనిపిస్తోంది. ఈ తిరుగుబాటే రేపటికి గెలుపు బాట అవుతుంది. 

పల్నాడు ప్రాంతంలో మన పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటారు. వాళ్లు విడిచిన ప్రాణాలు అనునిత్యం నన్ను కదిలిస్తుంటాయి. ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య, జల్లయ్య వంటి కార్యకర్తలకు నివాళులు అర్పిస్తున్నా. మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే, నా ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట అనలేను... జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన వ్యక్తి చంద్రయ్య. అందుకే ఆయన పాడె మోశాను. 

పల్నాడు ప్రాంతంలో ఈ వైసీపీ రౌడీలు 30 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. అందుకు చాలా బాధేస్తుంది. ప్రాణాలు పోయినా వారి కుటుంబ సభ్యులు మళ్లీ జెండాను మోయడం ఎంతో స్ఫూర్తిదాయకం. అధికారంలోకి వచ్చాక వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం. 

ఇక్కడ మంచి అభ్యర్థిని మీకిచ్చాం. బ్రహ్మారెడ్డి వచ్చాక ప్రత్యర్థుల్లో భయం ఏర్పడింది. బ్రహ్మారెడ్డి దూసుకెళుతున్నాడు... నూటికి నూరుశాతం బ్రహ్మారెడ్డి గెలుపు ఖాయం. మరోవైపు, నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతడు అనుభవం ఉన్న వ్యక్తి... అభివృద్ధే ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు. పల్నాడును పైకి తీసుకురావాలన్నది ఆయన ఆశయం. 

టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి. ఈ సందర్భంగా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా... మీరు చేసిన త్యాగాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ హామీ ఇస్తున్నా... మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాను. మీరు కూడా అధైర్యపడకుండా ముందుకు వెళ్లండి.

జనసైనికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడుతున్న వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే  కాదు రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో. ఆయన ఒకటే ఆలోచించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి పనిచేస్తున్నారు. పొత్తు అనివార్యం, మనం పొత్తు పెట్టుకోవాలి అని మొదట చెప్పిన వ్యక్తి పవన్. 

మరోవైపు బీజేపీ కూడా ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులందరి విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సహకరించాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News