KCR: ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తోంది: కేసీఆర్

  • పదేళ్లలో మోదీ 150 హామీలు, నినాదాలు ఇచ్చారన్న కేసీఆర్
  • పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలు పెరిగాయన్న బీఆర్ఎస్ అధినేత
  • మోదీ అచ్చేదిన్ అంటే చచ్చేదిన్ వచ్చిందని విమర్శ
KCR fires at Modi government in Karimnagar

ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ... పదేళ్లలో మోదీ 150 హామీలు, నినాదాలు ఇచ్చారన్నారు. ఆయన చెప్పినదాంట్లో ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. పైగా పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలు పెరిగాయన్నారు. మోదీ అచ్చేదిన్ అని నినదిస్తే సామాన్యులకు చచ్చేదిన్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ద్వారా అప్పర్ మానేరు నుండి అన్నారం బ్యారేజ్ వరకు, వరద కాలువను రిజర్వాయర్ చేసి, కాకతీయ కాలువను 10 నెలలు నీళ్లు ఉండేలా పారించి, గోదావరి మీద రిజర్వాయర్లు కట్టి కరీంనగర్‌ను సస్యశ్యామలం చేశానన్నారు. ఇప్పుడు కాళేశ్వరంకు ఏదో అయిందని కరీంనగర్‌ను ఎండబెట్టారని మండిపడ్డారు. ఊళ్లలోకి మళ్లీ బోరు బండ్లు వస్తున్నాయన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయన్నారు.

ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌తో పైసా పని అయిందా? ఒక్కసారైనా పార్లమెంటులో మాట్లాడారా? అసలు మాట్లాడొస్తదా? అని ఎద్దేవా చేశారు. ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా... ఇంగ్లీషా తెలియక మనమే చావాలని... అలాంటి భాష పార్లమెంట్‌లో అందరికీ అర్థమవుతుందా? అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్లమెంటుకు పంపించవద్దన్నారు. న్యాయవాది, ఉద్యమాల బిడ్డ తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వినోద్ కుమార్‌ను గెలిపించుకుందామన్నారు.

  • Loading...

More Telugu News