Pawan Kalyan: రాజకీయాలపై అలిగిన వ్యక్తిని నేను ఈయనలోనే చూస్తున్నా: పవన్ కల్యాణ్

Pawan Kalyan talks about Vangaveeti Radha
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వారాహి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన జనసేనాని

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభంలో టీడీపీ నేత వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

"రాజకీయాలపై అలిగిన వ్యక్తిని మొట్టమొదటిగా నేను ఈయనలోనే చూస్తున్నా. అనేక పర్యాయాలు గడ్డం పట్టుకుని బతిమాలాను. రా నాన్నా, రామ్మా అని బతిమాలితే అస్సలు మాట వినడే! నా పార్టీలోకి రాకపోయినా కనీసం నువ్వు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండు... విజయవాడ ప్రజలకు నువ్వు అవసరం... నాన్న గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పాను. 

ఏదైతేనేం... ఈ రోజున జూలు దులుపుకుని బయటికి వచ్చాడు. ఇవాళ కూడా వారాహి వాహనం కింద దాక్కున్నాడు. వీల్లేదు నువ్వు బయటికి రావాల్సిందే, విజయవాడ ప్రజలకు నువ్వు కనిపించాల్సిందే అని వేదికపైకి లాక్కొచ్చాను. రాధాకు, సోదరుడు వంగవీటి రంగా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకు. బలమైన నాయకుల సమూహాలు కావాలి. 

ఇక, కూటమి ఆవిర్భావం గురించి అనుకోగానే, ఇక్కడ జలీల్ ఖాన్ పేరు వినిపించింది. నేను చిన్నప్పటిగా ఉన్నప్పటి నుంచి ఆయన తెలుసు. అప్పట్లో నేను ఆయనకు తెలియకపోవచ్చు. 

ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మ వాళ్లు ఉండేవాళ్లు. దర్శకుడు మెహర్ రమేశ్ కు సంబంధించినవాళ్లు. సమ్మర్ హాలిడేస్ కు నేను మాచవరం వచ్చేవాడ్ని. మా పెద్దమ్మ అల్లుడు... జలీల్ ఖాన్ వద్ద పనిచేశారు. వ్యాపారంలో కూడా కొంచెం భాగస్వామ్యం ఉంది. ఆ విధంగా నేను జలీల్ ఖాన్ గారి గురించి వినేవాడ్ని. 

అలాంటిది జలీల్ ఖాన్ గారు ఇటీవల వచ్చి... మీరు అవకాశం ఇస్తే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాలేదని ఆయనకు ఆ రోజున చెప్పాను. ఆయన జనసేనలోకి వస్తానన్నప్పుడు ఒకటే చెప్పాను... మీరు జనసేనలో ఉన్నా, టీడీపీలో ఉన్నా మనమందరం అన్ని పార్టీల ఐక్యతతో పనిచేస్తాం... మీ భవిష్యత్తుకు అండగా ఉంటాం అని మనసు విప్పి చెప్పాను. ఇవాళ మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు జలీల్ ఖాన్ గారికి ధన్యవాదాలు. 

వాస్తవానికి విజయవాడ వెస్ట్ జనసేన సీటు. కానీ బీజేపీ అధినాయకత్వం నన్ను ఒక మాట అడిగింది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. 

ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.... దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవ మూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారు, ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారు. 

వాళ్ల నాయకుడి తలకు రాయి తగిలిందట! ఆ రాయి ఏంటో గానీ, తల చుట్టూ 360 డిగ్రీలు తిరిగి ఇటు తగిలిందట. దానికి ఆయన ఎంతో బాధపడిపోతున్నారు. ఆయన నటనతో పోల్చితే నేను సినిమాల్లో కూడా అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేను. అది ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్" అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News