IPL 2024: ఈ ఐపీఎల్ సీజన్‌లో మరో అద్భుత రికార్డు!

IPL 2024 achieves new milestone with 1000 sixes in record deliveries during SRH vs LSG clash
  • ఈ సీజన్‌లో కేవలం 13,079 బంతుల్లోనే వెయ్యి సిక్సులు
  • అతి తక్కువ బంతుల్లో వెయ్యి సిక్సులు నమోదైన సీజన్‌గా సరికొత్త రికార్డు
  • అంతకు మునుపు సీజన్‌లో 15,390 బంతుల్లో సిక్సుల రికార్డు
  • 2022 ఐపీఎల్‌లో 16,269 బంతుల్లో 1000 సిక్సులు

ఐపీఎల్ - 2024 సీజన్‌లో బ్యాటర్ల ధాటికి పరుగుల వరద పారుతోంది. ఇప్పటివరకూ వివిధ టీమ్స్ 8 మార్లు 250 పైచిలుకు స్కోర్లు సాధించాయి. ఈ క్రమంలోనే నిన్నటి ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో మరో అద్భుత రికార్డు ఉనికిలోకి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 1000 సిక్సులు నమోదయ్యాయి. కేవలం 13,079 బంతుల్లో బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు సీజన్‌లో బ్యాటర్లు 15,390 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా 2022 ఐపీఎల్‌లో 16,269 బంతుల్లో వెయ్యి సిక్సులు బాదారు. 

మరో విశేషమేంటంటే..ఈ సీజన్‌లోనే పవర్ ప్లేలో అత్యధిక సిక్సులు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో పవర్‌ప్లేలో ఏకంగా 23 సిక్సులు బాదాడు. ఇదే టీంకు చెందిన ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌లోనే 23 సిక్సులు కొట్టాడు. ఇక ఐపీఎల్ 2008 పవర్‌ప్లేలో సనత్ జయసూర్య (ముంబై ఇండియన్స్) 22 సిక్సులు సాధించాడు. 

మరోవైపు, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో జైంట్స్‌ను మట్టి కరిపించింది. అద్భుత బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు లక్నో జైంట్స్‌ను కేవలం 165 పరుగులకే కట్టడి చేశారు. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా లేకపోవడంతో అనేక మంది తడబడ్డారు. అయితే, ఆయోష్ బదోనీ, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో జెయింట్స్ ఎస్ఆర్‌హెచ్‌కు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. 

లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే కేవలం 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ట్రావిస్ 30 బంతుల్లో 89 పరుగులు చేయగా అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 14 సిక్సులు బాది అత్యధిక సిక్సులు సాధించిన టీంగా నిలిచింది.

  • Loading...

More Telugu News