mumbai: సోషల్ మీడియాలో పాలస్తీనాకు లైక్ కొట్టినందుకు ప్రిన్సిపాల్ డిస్మిస్!

  • ముంబైలోని సోమయ్య విద్యావిహార్ కఠిన నిర్ణయం
  • పర్వీన్ షేక్ వ్యక్తిగత సోషల్ మీడియా కార్యకలాపాలు సంస్థ విలువలకు అనుగుణంగా లేవంటూ వేటు
  • తనను తొలగించడాన్ని చట్ట విరుద్ధంగా అభివర్ణించిన పర్వీన్
top mumbai school sacks principal for liking posts on palestine

ముంబైలోని ప్రముఖ మేనేజ్ మెంట్ స్కూల్ అయిన సోమయ్య విద్యావిహార్ కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్–ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో పాలస్తీనావాసులకు అనుకూలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టిన పోస్ట్ లను లైక్ కొట్టినందుకు ప్రిన్సిపాల్ పర్వీన్ షేక్ ను డిస్మిస్ చేసింది. తమ విద్యాసంస్థ విలువలకు అనుగుణంగా ప్రిన్సిపాల్ వ్యక్తిగత సోషల్ మీడియా కార్యకలాపాలు లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాము నమ్మిన ఐకమత్యం, సమ్మిళిత భావాలు ప్రమాదంలో పడరాదనే ఉద్దేశంతోనే ఆమె సేవలను తక్షణమే నిలిపేసినట్లు యాజమాన్యం పేర్కొంది. గత 12 ఏళ్లుగా స్కూలుకు తన సేవలు అందిస్తున్న పర్వీన్ షేక్ అందులో ఏడేళ్ల నుంచి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు.

‘మేం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తిగా మద్దతిస్తాం. కానీ అదే సమయంలో ఆ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని కూడా గుర్తిస్తాం. ఇతరులను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఆ హక్కును ఉపయోగించుకోవాలి. సమాజంలోని అన్ని సంస్కృతులు, విశ్వాసాలను గౌరవిస్తూ చదువు అందించడంతోపాటు సమాజం, దేశాభివృద్ధికి మా వంతు తోడ్పాటు అందించాలన్న విలువలకు కట్టుబడి ఉన్నాం. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే పర్వీన్ షేక్ భాగస్వామ్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో సోమయ్య స్కూల్ యాజమాన్యం ఓ ప్రకటనను పోస్ట్ చేసింది.

అయితే తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అసాధారణమని పర్వీన్ షేక్ పేర్కొంది. స్కూల్ యాజమాన్యం రాజకీయ ప్రేరేపితంగా తీసుకున్న ఈ చర్యపట్ల షాక్ కు గురైనట్లు చెప్పింది. 12 ఏళ్లుగా విద్యాసంస్థ అభివృద్ధికి అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన తనపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని నమ్మి స్కూల్ యాజమాన్యం తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. దేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, యాజమాన్యం చర్యపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News