Pro Khalistani parade: కెనడాలో ఖలిస్థానీ అనుకూల ర్యాలీ.. భారత్ అగ్గిమీద గుగ్గిలం

  • ఒంటారియో గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ
  • భారత్ ఉగ్రవాదులుగా ముద్రవేసిన నాయకులు ర్యాలీలో పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగాలు
  • భారత దౌత్యవేత్తల ఫొటోలు ప్రదర్శిస్తూ బెదిరింపులు, ర్యాలీపై భారత్ ఆగ్రహం
  • భావప్రకటనా స్వేచ్ఛ పేరిట హింసను ప్రోత్సహించొద్దంటూ కెనడాకు భారత్ హితవు
India calls out Canada over celebration of violence at pro Khalistan parade

భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కెనడాలో ఖలిస్థానీ అనుకూల ర్యాలీలు జరగడంపై కేంద్రం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హింసను ప్రోత్సహించడం తగదని హితవు పలికింది. ఒంటారియోలో గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో ఈ పరేడ్ నిర్వహించారు. 

పరేడ్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కెనడాలో వేర్పాటువాద భావజాల చిహ్నాల ప్రదర్శనలపై మేము గతంలో అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశాము. కెనడా రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేశాము. గతేడాది మా మాజీ ప్రధానిని హత్య చేసినట్టు చిత్రాలను ప్రదర్శించారు. భారత దౌత్యవేత్తలను ప్రదర్శిస్తూ కెనడా వ్యాప్తంగా వారి చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. హింసను ప్రోత్సహించే పోకడలకు సభ్య సమాజంలో తావుండకూడదు. ప్రజాస్వామిక దేశాలు చట్టబద్ధపాలనను గౌరవించాలి. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట తీవ్రవాద భావజాల వర్గాల బెదిరింపులను అనుమతించకూడదు. కెనడాలో భారత దౌత్య అధికారుల భద్రత విషయంలో మేము ఆందోళన చెందుతున్నాం. భారత దౌత్యవేత్తలు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించేలా వాతావరణాన్ని కెనడా ప్రభుత్వం కల్పించాలని ఆశిస్తున్నాం. వేర్పాటువాద, ఉగ్రవాద శక్తులకు అవకాశాలు కల్పించొద్దని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. 

ఓంటారియో గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో నగర్ కీర్తన్ పరేడ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. ఇందులో వక్తలు పదే పదే ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకున్నారు. మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ పరేడ్‌ సాగింది. భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించిన దాల్ ఖల్సా నేత పరమ్‌జీత్ సింగ్, అవతార్ సింగ్ పన్ను వంటి వారు పరేడ్‌లో పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.

సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం భారత్‌తో దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News