Pawan Kalyan: కోడిబొచ్చు అమ్ముకునేవాళ్లకు మనం ఓటేస్తామా?: తిరుపతిలో పవన్ ఫైర్

  • తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో
  • గాంధీ రోడ్ లో కూటమి సభ
  • చంద్రబాబును వేనోళ్ల కీర్తించిన జనసేనాని
  • వైసీపీ నేతలను ఓ రేంజిలో విమర్శించిన వైనం
Pawan Kalyan fires on YCP leaders in Tiruapati rally

తిరుపతి నగరంలో రోడ్ షో నిర్వహించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్థానిక గాంధీ రోడ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, ఏడుకొండలవాడికి గోవిందా గోవింద అంటూ ప్రారంభించారు. 

ఇక్కడే పెరిగి, గల్లీ గల్లీ తిరిగి, స్టూడెంట్ రాజకీయాలు చేసి, ఎస్వీ యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసి, అలిపిరిలో బాంబు పేలుడుతో 16 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా, వెంటనే  లేచి దుమ్ము దులుపుకుని ముందుకు నడిచిన నేత చంద్రబాబు అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందుండి నడిపిస్తున్న టీడీపీ అధినేతకు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

"టీడీపీ నేతలకు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. కూటమి అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులును భారీ మెజారిటీతో గెలిపించాలి. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనను కూడా గెలిపించాలి. చంద్రగిరి నుంచి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి. 

ఇక్కడ కరుణాకర్ రెడ్డి (భూమన) గారు ఉన్నారు. వాళ్లబ్బాయి మీకు ఎమ్మెల్యేగా కావాలా? ఆఖరికి కోడిబొచ్చు కూడా అమ్ముకుంటున్నారు... ఇలాంటి వాళ్లు మీకు కావాలా? లేదంటే... మోదీ, చంద్రబాబు, జనసేన మద్దతుతో బలంగా నిలబడిన ఆరణి శ్రీనివాసులు కావాలా?

ఆ రోజు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించారు. చంద్రబాబు గారిని ఒక్కటే కోరాను... తిరుపతి పవిత్రతను కాపాడుకుంటా, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, కులాలకు, మతాలకు భేదాలు చూడకుండా అందరినీ సంరక్షించుకుంటాం అని చెప్పాను. అందుకు కూటమి తరఫున చంద్రబాబు గారు పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

వైసీపీ ప్రభుత్వ ఇక్కడి నుంచి అమరరాజాను తరిమేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరరాజాను తీసుకువస్తాం. ప్రజలు గనుక కరుణాకర్ రెడ్డికి గానీ, వాళ్లబ్బాయికి గానీ ఓటేస్తే... ప్రతి దాంట్లో 10:30 నిష్పత్తిలో పంపకాలు చేసుకుంటారు. ఇల్లు కట్టాలంటే 10 శాతం కొడుక్కి, 30 శాతం తండ్రికి చెల్లించాల్సిందే! ఎంతకాలం భయపడతాం... ఏడు కొండలవాడిని పైన ఉంచుకుని మనం భయపడతామా? ఉక్కుపాదంతో ఆకురౌడీలందరినీ తొక్కి పడేస్తాం. 

కరుణాకర్ రెడ్డి, వాళ్లబ్బాయి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి... శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లన్నింటిని నరికేశారు. రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కాం జరిగింది... డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఈ పరిస్థితి మార్చుకోవాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. 

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నెల రెండో మంగళవారం తిరుపతి ప్రజలు తిరుమల వెంకన్నను దర్శించుకునే అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడా వెసులుబాటు తీసేశారు. తిరుపతి ప్రజలకు రెండో మంగళవారం నాడు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. మేం వచ్చాక దాన్ని పునరుద్ధరిస్తాం. 

లడ్డూల నాణ్యత తగ్గించేశారు... సైజు తగ్గించేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట రేట్లు పెంచారు... ఎటూ చూసినా అడ్డగోలుగా దోపిడీ, దళారీలు, లంచాలు! వైవీ సుబ్బారెడ్డి గానీ, కరుణాకర్ రెడ్డి గానీ ఒకటి గమనించాలి... ఇది రిసార్ట్ కాదు... పుణ్యక్షేత్రం. తిరుమల ఆధ్యాత్మికతను తిరిగి తీసుకువస్తాం. 

ఎంత దారుణం అంటే... ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ... ఇక్కడ కూడా  టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిపై కూడా నవ్వుతూ ఉండే జగన్ బొమ్మ వేస్తున్నారు! టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై ఏడుకొండలవాడి ఫొటో వేస్తారా, జగన్ ఫొటో వేస్తారా? ఇది ఏడుకొండలవాడ్ని అవమానించినట్టే. స్వామివారిని అవమానించిన వ్యక్తికి, వారి పార్టీకి మనం ఓటేస్తామా, కోడిబొచ్చు అమ్ముకునేవాళ్లకు మనమెందుకు ఓటెయ్యాలి?" అంటూ పవన్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News