Chilean Angel Shark: దాదాపు 150 ఏళ్ల తరువాత కనిపించిన అరుదైన సొరచేప!

  • ఇటీవల చిలీ దేశ జాలర్లకు చిక్కిన చిలియన్ ఏంజిల్ షార్క్
  • అంతరించిపోయే దశలో ఉన్న ఈ చేప మళ్లీ కనిపించడంతో శాస్త్రవేత్తల్లో హర్షం
  • ఈ సొరల అధ్యయనంతో మరింత మెరుగ్గా సంరక్షణ చర్యలు చేపడతామంటున్న శాస్త్రవేత్తలు
Missing Since 1800s Ocean Predator Appears In Fishers Net In Chile

చిలియన్ ఏంజిల్ షార్క్ అనే అరుదైన సొర చేప ఇటీవల చిలీ దేశ మత్సకారులకు చిక్కింది. దీంతో, శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఈ సొర గురించి పూర్తి సమాచారం లభించక శాస్త్రవేత్తల్లో అసంతృప్తి ఉండేది. 

1887లో చివరిసారిగా ఈ చేపను ఓ పరిశోధకుడు తీరప్రాంతపు లోతు తక్కువ నీళ్లల్లో గుర్తించాడు. అప్పట్లో ఈ సొరను అతడు రే చేపగా పొరబడ్డాడు. అయితే, చేప గురించి అతడి వివరణ అసంపూర్ణమని ఆ తరువాతి పరిశోధనల్లో తేలింది. ఇది చాలదన్నట్టు నాటి సొర కళేబరం కనబడకుండా పోవడంతో శాస్త్రవేత్తలకు ఈ జీవిని అధ్యయనం చేసే అవకాశం లేకుండా పోయింది. సముద్రజీవాల సమాచారంలో ఇదో పెద్ద లోపంగా మారింది. చివరకు మిస్టరీగా మారింది.  ఇలాంటి సమయంలో చిలియన్ ఏంజిల్ సొర మళ్లీ కనిపించడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

దాదాపు మూడు అడుగుల పొడవుండే ఈ సొర..సముద్రపు నీటి అడుగున ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రే చేప ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇది సముద్రాల్లో కనిపించడంతో దీనిపై శాస్త్రవేత్తల వద్ద అంత సమాచారం లేదు. ఈ సొర అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా దొరికిన సొరల అధ్యయనంతో వీటి సంరక్షణకు మరిన్ని మెరుగైన చర్యలు చేపట్టొచ్చని అశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News