Heat Waves: నేడు, రేపు జరభద్రం!.. తెలంగాణలో 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు.. హడలిపోతున్న ప్రజలు

  • నిప్పుల కొలిమిలా తెలంగాణ
  • జమ్మికుంటలో వరుసగా రెండోరోజు కూడా 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు
  • బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం
  • వడదెబ్బతో రాష్ట్రంలో ఇద్దరి మృతి
Temperatures in Telangana crossed 45 degrees

తెలంగాణ రోజురోజుకు నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుసగా రెండో రోజు కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసి 45.6 డిగ్రీలకు చేరుకున్నాయి. అంతకుముందు రోజు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, ములుగు జిల్లా మల్లూరు 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరు, ములుగు జిల్లా ధర్మవరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. హైదరాబాద్‌ ముసాపేటలోని బాలాజీనగర్‌లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డు కాగా, నగరంలోని మిగతా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాగా, వడదెబ్బ కారణంగా సూర్యాపేట జిల్లా కొత్తగోల్‌తండాకు చెందిన కూలీ బానోత్ మంగ్యా (40), హనుమకొండ జిల్లా పులుకుర్తికి చెందిన ఎండనూరి రాజు (35) ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News