Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర.. ఉత్కంఠపోరులో చేతులెత్తేసిన లక్నో

  • 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
  • లక్ష్య ఛేదనలో 71 పరుగులతో రాణించిన కెప్టెన్ సంజూ శాంసన్
  • ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్
Rajasthan Royals chase down highest ever score in Lucknow against Lucknow Super Giants

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ సంజూశాంసన్, యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రాణించడంతో 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఏకనా స్టేడియంలో అత్యధిక స్కోరును ఛేజ్ చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు 9 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు అందుకున్న రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌లో అనధికారికంగా అడుగుపెట్టింది.

లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (నాటౌట్) 33 బంతుల్లో 71 పరుగులు బాదాడు. ఇక ధ్రువ్ జురెల్ (నాటౌట్) 34 బంతుల్లో 52 పరుగులు కొట్టాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కు 121 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో లక్ష్య ఛేదన సులభమైంది. మిగతా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 24, జాస్ బట్లర్ 34, రియాన్ పరాగ్ 14 చొప్పున పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, అమిత్ మిశ్రా తలా ఓ వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీపక్ హుడా 50 పరుగులతో భారీ స్కోరు సాధించడంలో సహకారం అందించాడు. మూడో వికెట్‌కు రాహుల్-హుడా కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాటర్లలో డికాక్ 8, స్టొయినిస్ 0, పూరన్ 11, ఆయుశ్ బదోని 18(నాటౌట్), కృనాల్ పాండ్యా 15(నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు, బౌల్ట్, అవేశ్ ఖాన్, అశ్విన్ తలా ఓ వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు.

More Telugu News