Harish Rao: రాజీనామా పత్రంతో గన్ పార్క్ కు చేరుకున్న హరీశ్ రావు

  • హరీశ్ రావుకు మద్దతుగా వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్
  • భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
  • పెద్ద సంఖ్యలో పోలీసుల మోహరింపు 
Former Minister Harish Rao At Gunpark With Resignation letter

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాదులోని గన్ పార్క్ కు చేరుకున్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఆగస్టు 15 లోగా రైతుల రుణాలు (రూ.2 లక్షల లోపు) మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ.. ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు.

ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీశ్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్కు వద్ద తేల్చుకుందాం, రాజీనామా లేఖతో రావాలని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీశ్ రావు గన్ పార్క్ కు చేరుకున్నారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. మాజీ మంత్రికి మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమే..
గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు పూలతో నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను స్థూపం ముందుంచారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనల ప్రకారమే తాము ఐదుగురమే ఇక్కడ ఉన్నామని హరీశ్ రావు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానని హరీశ్ రావు చెప్పారు. ఎన్నికల హామీలను అమలుచేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటున్నారని, ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు.

రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖతో గన్ పార్కుకు రావాలని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు. ఇద్దరి రాజీనామాలను ఇక్కడికి వచ్చిన మేధావులకు అందజేసి వెళదామని అన్నారు. ఆగస్టు 15 నాటికి హామీలు అమలు చేయకుంటే మీ రాజీనామాను గవర్నర్ కు, అమలుచేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్ కు పంపిద్దామని హరీశ్ రావు చెప్పారు. అనంతరం తన రాజీనామా లేఖను అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీశ్ రావు వెళ్లిపోయారు.

More Telugu News