Virender Sehwag: టీ20 వరల్డ్ కప్‌కి సెహ్వాగ్ తుది జట్టు ఇదే.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్

  • తుది జట్టులో హార్ధిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోని మాజీ దిగ్గజం
  • పేసర్లలో బుమ్రా, సిరాజ్‌తో పాటు సందీప్ శర్మకు చోటు ఇచ్చిన మాజీ ఓపెనర్
  • రింకూ సింగ్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చని అభిప్రాయం
Virender Sehwag Names His Strongest India XI For T20 World Cup

జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టుని ప్రకటించాల్సిన గడువు మే 1 సమీపిస్తున్నా కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. మాజీ ఆటగాళ్లు రకరకాల అంచనాలు, విశ్లేషణలు చేస్తున్నారు. వేర్వేరు ఆటగాళ్ల పేర్లను సూచిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన కలల తుది జట్టుని ఎంపిక చేశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అంతగా రాణించలేకపోతుండడంతో అతడిని సెహ్వాగ్ పక్కనపెట్టాడు. బలమైన జట్టు ఆడాలనుకుంటే తుది జట్టులో పాండ్యాకు చోటివ్వకూడదని అన్నాడు. అయితే 15 మంది సభ్యులలో ఒకడిగా ఎంపిక చేయవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌’లో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ మేరకు తన అంచనా జట్టుని వెల్లడించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్ ఆరంభించాలని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3, 4 స్థానాల్లో బ్యాటింగ్ చేయాలన్నాడు. ఇక వికెట్ కీపర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఇక యువ సంచలనాలు రింకూ సింగ్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చని పేర్కొన్నాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పేర్లు, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మలను సెహ్వాగ్ ఎంచుకున్నాడు.

సెహ్వాగ్ తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే/రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.

కాగా టీ20 వరల్డ్ కప్ 2024 జట్టు ఎంపికకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వారం చివరిలో న్యూఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ సెలెక్టర్లు చర్చించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

More Telugu News