Piyush Goyal: కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను ఏపీలో దారి మళ్లించారు: కేంద్రమంత్రి పియూష్ గోయల్

  • టీడీపీ అధినేత చంద్రబాబుతో పియూష్ గోయల్ సమావేశం
  • ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చర్చ
  • అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి
  • వైసీపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని ఆరోపణ
Union minister Piyush Goyal slams AP Govt after meeting with Chandrababu

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టో, రాజకీయ ప్రచారం తదితర అంశాలపై పియూష్ గోయల్... చంద్రబాబుతో మాట్లాడారు. ఈ భేటీ కొద్దిసేపటి క్రిందట ముగిసింది. 

అనంతరం పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ఏ వర్గాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని... రైతులు, కార్మికులు, యువతను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. 

ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్లను మోదీ ఏపీకి కేటాయించారని పియూష్ గోయల్ వెల్లడించారు. కానీ జగన్ ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్లనే నిర్మాణం చేసిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను దారిమళ్లించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక ప్రాజెక్టులలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని స్పష్టం చేశారు.

విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారని, కానీ రైల్వే ప్రాజక్టులకు అవసరమైన భూములను జగన్ ప్రభుత్వం కేటాయించలేదని కేంద్రమంత్రి వివరించారు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందని ఉద్ఘాటించారు. 

ఏపీలో కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజవనరులు ఉన్నాయని పియూష్ గోయల్ తెలిపారు.

More Telugu News