Rishabh Pant: కెమెరామ్యాన్‌కు రిష‌భ్ పంత్ 'సారీ'.. వీడియో ఇదిగో!

  • గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన రిష‌భ్ పంత్‌
  • 43 బంతుల్లో 88 పరుగుల‌తో గుజ‌రాత్ బౌల‌ర్ల ఊచ‌కోత‌
  • ఈ క్ర‌మంలో ఆయ‌న కొట్టిన ఒక సిక్స్‌ కెమెరామ్యాన్‌కు త‌గిలిన వైనం
  • మ్యాచ్ అనంత‌రం కెమెరా ప‌ర్స‌న్‌కు పంత్ క్ష‌మాప‌ణ‌లు
Rishabh Pant apologizes to cameraman who was hit by his shot

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న గుజ‌రాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కెప్టెన్ రిషభ్‌ పంత్ 43 బంతుల్లో 88 పరుగుల‌తో గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొట్టిన ఒక సిక్స‌ర్ కెమెరామ్యాన్‌కు త‌గిలింది. దీంతో మ్యాచ్ అనంత‌రం అత‌డికి పంత్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.  

ఐపీఎల్‌ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పంత్ మ్యాచ్ అనంత‌రం డీసీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో క‌లిసి కనిపించాడు. ఈ సంద‌ర్భంగా కెమెరా ప‌ర్స‌న్‌కు సారీ చెప్పాడు. అతను త్వ‌ర‌గా కోలుకోవాలని ఆకాంక్షించాడు. "క్షమించండి దేబాశిష్ భాయ్. నిన్ను కావాల‌ని కొట్ట‌లేదు. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నా" అని పంత్ తెలిపాడు.  

"డీసీ వ‌ర్సెస్ జీటీ మ్యాచ్‌లో మా బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకి చెందిన కెమెరాపర్సన్‌లలో ఒకరికి దెబ్బ తగిలింది. రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెమెరాపర్సన్ కోసం ఒక ప్రత్యేక సందేశం పంపించారు" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పంచుకుంది.

ఇక ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన పంత్  తాను ఎదుర్కొన్న చివరి 18 బంతుల్లో 62 పరుగులు చేశాడు. జీటీ బౌల‌ర్ మోహిత్ శ‌ర్మ వేసిన‌ చివరి ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఢిల్లీ స్కోర్‌ 224కి చేరింది. అటు గుజ‌రాత్ కూడా ఛేజింగ్‌లో చివ‌రి వ‌ర‌కు పోరాడింది. డేవిడ్ మిల్ల‌ర్‌, సాయి సుద‌ర్శ‌న్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ల కార‌ణంగా 220 ప‌రుగులు సాధించి 4 ర‌న్స్ తేడాతో ఓడింది.

More Telugu News