Revanth Reddy: అరుణమ్మా... నాకు శత్రువులు, ప్రత్యర్థులు ఎవరూ లేరు: సీఎం రేవంత్ రెడ్డి

  • డీకే అరుణపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
  • డీకే అరుణ శత్రువు చేతిలో చురకత్తై పాలమూరు ప్రజల కడుపులో పొడుస్తున్నారని విమర్శ
  • మేమూ హిందువులమే... దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలన్న ముఖ్యమంత్రి
CM Revanth Reddy says he have no enemies

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు... ప్రత్యర్థులు ఎవరూ లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మారుమూల కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. మన దెబ్బకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకోకుండా ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

డీకే అరుణ మనకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారని, డబుల్ రోడ్డు వేయలేదని, మక్తల్ ఎత్తిపోతలకు అడ్డుపడ్డారని విమర్శించారు. డీకే అరుణ శత్రువు చేతిలో చురకత్తై పాలమూరు ప్రజల కడుపులో పొడుస్తున్నారన్నారు. ఈ అయిదేళ్లు పాలమూరు ప్రజలు అండగా నిలబడితే... అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. ఇప్పుడు మనం సంతకం పెట్టే స్థితిలో ఉన్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం.. ఏ పార్టీ వారైనా పాలమూరు ప్రజలు తనకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలను, జెండాలను పక్కన పెట్టి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

అమ్మా తల్లీ... డీకే అరుణమ్మ... నేనేదో నిన్ను అవమానించానని అంటున్నావ్... కానీ నీకు, నాకు మధ్య పోటీ ఏమిటి? అని నిలదీశారు. గద్వాలలోనే ఓడిపోయిన నీకు, నాకు పోటీయా? అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరుకు ఏం చేశావో చెప్పాలన్నారు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేం చేసుకుందామని అనుకుంటే మోదీ చేతిలో మళ్లీ కత్తివై అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చేతిలో చురకత్తిలా ఎందుకు మారావో చెప్పాలన్నారు. నీ మీద నాకు అసూయ, కోపం, ద్వేషం లేవన్నారు. "అమ్మా తల్లీ... నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని... నాకు ఈ జిల్లాలో శత్రువులెవరూ లేరు" అని సీఎం పేర్కొన్నారు.

పాలమూరుకు ముఖ్యమంత్రి పదవి లేకలేక వచ్చిన అవకాశమని... వందేళ్లయినా మళ్లీ ఇలాంటి అవకాశం రాదని, కాబట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దొంగ దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. మేం కూడా హిందువులమే... పూజలు చేసేవాళ్లమే... కానీ దేవుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలని బీజేపీకి చురక అంటించారు. బజారుకెళితేనే భక్తి కాదని హితవు పలికారు. ఇతరులను గౌరవించాలన్నారు. హిందూమతంలోనే మతసామరస్యం... పరమతసహనం వున్నాయని గుర్తించాలన్నారు. ఊళ్లలో పీర్లపండుగ చేసేది కూడా మతసామరస్యం పాటించే హిందువులేనన్నారు. బీజేపీ ఈ పదేళ్లలో ఏమీ చేయలేదని... చెప్పుకోవడానికి ఏమీ లేకనే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News