Sharad Pawar: ఇండియాలో మరో పుతిన్ తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది: శరద్ పవార్

  • దేశంలో నిరంకుశత్వం రాకుండా ప్రజలు అడ్డుకోవాలని పవార్ పిలుపు
  • ఎదుటి వారిని విమర్శించడాన్నే మోదీ పనిగా పెట్టుకున్నారని మండిపాటు
  • గత ఎన్నికల్లో నవనీత్ కౌర్ కు మద్దతు పలికినందుకు క్షమాపణ చెపుతున్నానన్న పవార్
Modi is trying to make Putin in India says Sharad Pawar

ఇండియాలో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుతిన్ ను మోదీ అనుకరిస్తున్నారని అన్నారు. గత ప్రధానులు నవ భారత్ ను తయారు చేయాడానికి కృషి చేశారని... మోదీ మాత్రం గత పదేళ్లలో ఆయన ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో చెప్పకుండా, విపక్ష నేతలపై నిందలు వేయడం, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న మహా కూటమి నేత వికాస్ (కాంగ్రెస్) తరపున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారని శరద్ పవార్ మండిపడ్డారు. దేశంలో నిరంకుశత్వం రాకుండా ప్రజలు అడ్డుకోవాలని, ఓటు ద్వారా వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. పుతిన్ ను అనుకరిస్తూ అందరిలో భయాందోళనలను సృష్టించేందుకు మోదీ యత్నిస్తున్నారని చెప్పారు. మన దేశంలో తయారవుతున్న పుతిన్ (మోదీ)ని చూసి ఆందోళనకు గురవుతున్నానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించాలని పిలుపునిచ్చారు.

అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని పవార్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, గెలుపొందిన నవనీత్ కౌర్ (సినీ నటి)కు తాను మద్దతుగా నిలిచానని... ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు. మరోవైపు నవనీత్ కౌర్ ఇటీవలే బీజేపీలో చేరారు. అమరావతి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

More Telugu News