Raghu Rama Krishna Raju: జగన్ మోహన్ రెడ్డి నా ముందు బాలుడు: రఘురామ

  • ప్రముఖ పాత్రికేయుడు జాఫర్ కు రఘురామ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
  • జగన్మాయ వల్లే తనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వలేదని వెల్లడి
  • చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టీకరణ
  • నాడు స్నేహితుడి కొడుకు అని జగన్ కు సాయం చేశానని వివరణ
  • కానీ పాముకు పాలు పోసి పెంచినట్టయిందని వ్యాఖ్య 
Raghu Rama Krishna Raju interview with Jaffer

నరసాపురం సిట్టింగ్ ఎంపీ, ఉండి అసెంబ్లీ స్థానం టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ప్రముఖ పాత్రికేయుడు జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తానెప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్టా, ఎమ్మెల్యే టికెట్టా అని ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్మాయ వల్లే తనకు ఎంపీ టికెట్ రాలేదని భావిస్తున్నానని తెలిపారు. 

జాఫర్: సినిమాల్లో హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నాలుగు  పాత్రలు ఉంటాయి... అందులో మీది ఏ పాత్ర?

రఘురామ: రాజకీయాలు ఒక సినిమా అనుకుంటే అందులో నేనే హీరో. జగన్ మోహన్ రెడ్డి విలన్, విజయసాయిరెడ్డి కమెడియన్.  

జాఫర్:
మరి ప్రొడ్యూసర్ చంద్రబాబు గారా?

రఘురామ: కాదు,కాదు అని రఘురామ బదులిచ్చారు. మాయాబజార్ సినిమాలో హీరో నాగేశ్వరరావే అయినా, ఆ సినిమా అంతా ఎస్వీరంగారావుపైనే నడుస్తుంది. చంద్రబాబు కూడా ఎస్వీరంగారావు వంటివారు

జాఫర్: మీరు ఎంపీగా ఉండి, ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్నారు... ఇది అవమానం అనుకుంటున్నారా?

రఘురామ: నేను దీన్నేమీ తిరోగమనంలా భావించడంలేదు. నాకు ఉండి అసెంబ్లీ సీటు ఖాయమైంది. చాలామంది అసెంబ్లీ సీటు రానివాళ్లు, ఏదో ఒకటిలే అని ఎంపీ సీటు అడుగుతున్నారు. నాకు ఎంపీయే కావాలని ఏపీలో అడిగినవాళ్లు లేరు. 

జాఫర్: మీ నాలుకే మీ రాజకీయ జీవితానికి శాపంలా మారిందని అనుకోవచ్చా?

రఘురామ: బహుశా నాకు వరం అదే, శాపం అదే. నాకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఎందుకంటే... జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు. 

జాఫర్: మోదీ, అమిత్ షా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మాట వినకుండా, ఏపీలో శత్రువర్గం అనదగ్గ వైసీపీ మాట విన్నారంటారా? మోదీ, అమిత్ షా కూటమి మాట కంటే, జగన్ మోహన్ రెడ్డి మాటకే విలువ ఇచ్చారంటారా? 

రఘురామ: ఏమో... అలాగేమైనా ఆలోచించారేమో! నేనేమైనా మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా... ఒక ఎంపీ సీటు అతడికి ఇవ్వొద్దనే కదా అడిగింది అని జగన్ వారిని కోరి ఉండొచ్చు.

జాఫర్: మోదీ, అమిత్ షాల వద్ద చంద్రబాబు స్ట్రాంగా, జగన్ స్ట్రాంగా, పవన్ కల్యాణ్ స్ట్రాంగా?

రఘురామ: కూటమి ఏర్పడిన తర్వాత ప్రస్తుతానికి చంద్రబాబే స్ట్రాంగ్.

జాఫర్: మరి చంద్రబాబు స్ట్రాంగ్ అయితే మీకు బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు?

రఘురామ: కొన్ని గత జన్మ వాసనలు ఉంటాయి. అవి ప్రభావం చూపించి ఉంటాయి.

జాఫర్: వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ను, ఇతర నేతలను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు, లోకేశ్ ల తీరు నచ్చకపోతే వారిని కూడా విమర్శిస్తారా?

రఘురామ: వారు ఆ విధంగా చేయరు. చంద్రబాబు నికార్సయిన పాలకుడు. నేను వారిపై మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. చంద్రబాబు వయసులో నాకన్నా పెద్దవారు. ఆయన ఏమన్నా గానీ ఆయనంటే నాకు గౌరవం ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి అనే వాడు నా ముందు బాలుడు. బాలుడు చాలా ఎక్ స్ట్రాలు మాట్లాడినప్పుడు ఒళ్లు మండింది. తప్పులు చేస్తున్నాడు కాబట్టి చెప్పాలనిపించింది. 

జాఫర్: ఇదే జగన్ మోహన్ రెడ్డిని మీరు గుండెల్లో పెట్టుకున్నప్పుడు అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై స్టింగ్ ఆపరేషన్ చేశారు కదా... కాల్ డేటా తీశారు కదా! అదేమీ చిన్న విషయం కాదు. 

రఘురామ: స్టింగ్ ఆపరేషనేమీ చేయలేదు. ఆ రోజు నా స్నేహితుడి కొడుకు అని భావించాను. కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు అని హెల్ప్ చేశాను. కానీ పాముకు పాలు పోసి పెంచినట్టయింది.

More Telugu News