General Elections-2024: దేశంలో ముగిసిన తొలి దశ పోలింగ్

  • ఈసారి ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
  • నేడు తొలి దశలో 102 పార్లమెంటు స్థానాలకు పోలింగ్
  • రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం ఓటింగ్ నమోదు
First phase polling in nation concluded

దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి దశ పోలింగ్ నిర్వహించారు. 13 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా నేడు పోలింగ్ నిర్వహించారు. 

కాగా, ఎన్నికల సంఘం నుంచి అందిన సమాచారం మేరకు రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి దశలో త్రిపురలో ఒక్క లోక్ సభ స్థానం కోసం ఎన్నికలు జరగ్గా, అత్యధికంగా 79.9 శాతం ఓటింగ్ జరిగింది. 

పశ్చిమ బెంగాల్ లో మూడు లోక్ సభ స్థానాల కోసం ఎన్నికలు జరగ్గా, 77.57 శాతం ఓటింగ్ జరిగినట్టు వెల్లడైంది. పుదుచ్చేరిలో 73.25 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్ లో మొదటి విడతలో భాగంగా 4 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, అత్యల్పంగా 47.49 శాతం ఓటింగ్ నమోదైంది. 

2019లో తొలి దశ ఎన్నికల్లో 91 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగ్గా... 69.68 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి తగ్గుదల కనిపించింది.

ఇక, ఇవాళ తొలి దశ పోలింగ్ సందర్భంగా మణిపూర్ లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెదురుమదురు సంఘటనలు జరిగాయి. ఇక, నాగాలాండ్ లో ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో ఆరు జిల్లాల్లో ఓటింగ్ నమోదు కాలేదు.

More Telugu News