Arvind Kejriwal: జైల్లో మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నాను: కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్

  • 48 సార్లు భోజనం చేస్తే మూడుసార్లు మామిడిపండ్లు, ఒకసారి ప్రసాదంగా ఆలూ తిన్నట్లు వెల్లడి
  • కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ మను
  • ఇన్సులిన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి, జైలు అధికారులకు ఆదేశాలు
Had Mangoes Only Thrice Says Delhi CM Arvind Kejriwal

తాను తీహార్ జైల్లో 48సార్లు భోజనం చేస్తే కేవలం మూడుసార్లు మాత్రమే ఇంట్లో వండిన ఆహారంలో మామిడిపండ్లు తిన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచి మూడుసార్లు మామిడిపండ్లు వచ్చాయన్నారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పొందేందుకు ఉద్దేశ్యపూర్వకంగా మామిడిపండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారని విచారణ సంస్థ కోర్టుకు తెలిపింది. దీంతో కేజ్రీవాల్ తరఫున ఈరోజు సీనియర్ అడ్వోకేట్ అభిషేక్ మను సింఘ్వీ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు.

జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను వివరాలు సమర్పించారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూ తింటున్నారన్న ఈడీ వాదనలపై అభిషేక్ మను సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలూ కూడా ప్రసాదంగా కేవలం ఒకేసారి పంపించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజాకు తెలిపారు.

ఛాయ్ తాగినట్లు ఈడీ చెప్పిందని... కానీ షుగర్ లేకుండానే కేజ్రీవాల్ దీనిని తీసుకున్నట్లు పేర్కొన్నారు. డయాబెటిక్ ఉంది కాబట్టి తీపి పదార్థాలు తీసుకోవడం లేదన్నారు. ఈడీ ఆరోపణలు చిల్లరగా, హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇందులో రాజకీయ కోణం కనిపిస్తోందన్నారు. జైల్లో ఉన్నంత మాత్రాన ఇంకా నేరస్తుడు కాదని... ఖైదీ అయితే హక్కులు ఉండవా? అన్నారు. కేజ్రీవాల్ ఏమైనా గ్యాంగ్‌స్టరా? హార్డ్ కోర్ నేరస్తుడా? అన్నారు. కనీసం వైద్యుడితో వర్చువల్‌గా 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఉండదా? అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎప్పుడూ ఇలాంటివి వినలేదు... కనలేదన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది రమేశ్ గుప్తా కూడా వాదనలు వినిపించారు.

ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హోసేన్ కోర్టుకు తన వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కు సూచించిన డైట్‌లో షుగర్‌ను పెంచే స్వీట్స్, పండ్లు లేవన్నారు. ముఖ్యమంత్రి పరిమిత ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆయన తీసుకున్న పదార్థాల కారణంగా షుగర్ లెవల్స్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. తాను ఇంతకుముందు ఇన్సులిన్ తీసుకున్నానని... ఇప్పుడు మానివేశానని కేజ్రీవాల్ స్వయంగా చెప్పారని కోర్టుకు తెలిపారు. 

ఈ సమయంలో, ఏప్రిల్ 1న కోర్టు అనుమతించిన డైట్ చార్ట్ ప్రకారమే ఇంటి ఫుడ్‌ను కేజ్రీవాల్‌కు ఇచ్చారా? అని సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. మూడుసార్లు మామిడిపండ్లు, ఒకసారి ఆలు పంపించామని... ఇది మినహా డైట్ చార్ట్‌ను అనుసరించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను పాటించినట్లుగా కనిపించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జైల్లో కేజ్రీవాల్‌కు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఇన్సులిన్ అందించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని, జైలు అధికారులను ఆదేశించింది.

More Telugu News