Salman Khan: స‌ల్మాన్ ఖాన్ ఇంటి బ‌య‌ట‌ కాల్పుల కేసులో కీల‌క మ‌లుపు..!

  • ఈ కేసుతో సంబంధం ఉన్న మూడో నిందితుడి అరెస్ట్‌
  • ఇప్ప‌టికే పోలీసుల అదుపులో షూట‌ర్లు విక్కీ గుప్లా, కుమార్ పాల‌క్
  • ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవ‌లం స‌ల్మాన్‌ను భ‌య‌పెట్ట‌డం మాత్ర‌మేన‌న్న‌ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  
Twist in Firing out side of Salman Khan House

బాలీవుడ్ నటుడు స‌ల్మాన్ ఖాన్ ఇంటి బ‌య‌ట గ‌త ఆదివారం తెల్ల‌వారుజామున ఇద్ద‌రు దుండ‌గులు కాల్పులు జ‌రిపి ప‌రారైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మ‌రో కీల‌క మలుపు వెలుగు చూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మ‌రో నిందితుడిని బుధ‌వారం రాత్రి హ‌ర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న షూట‌ర్లు విక్కీ గుప్లా, కుమార్ పాల‌క్ ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు మూడో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వ్య‌క్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు, షూటర్ల‌కు మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా ప‌ని చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. 

స‌ల్మాన్ ఇంటిముందు కాల్పులు జ‌రిపేందుకు షూట‌ర్ల‌కు అత‌డు రూ. 4 ల‌క్ష‌లు సుపారీ మాట్లాడుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్ రూపంలో రూ. 1 ల‌క్ష షూట‌ర్స్ కు ఇప్ప‌టికే అందిన‌ట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవ‌లం సల్మాన్ ను భ‌య‌పెట్ట‌డం మాత్ర‌మేన‌ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్ల‌డించారు. 

"స‌ల్మాన్ ఇంటి ముందు కాల్పులు జ‌ర‌ప‌డానికి ముందు నిందితులు ప‌న్వేల్‌లోని కండ‌ల‌వీరుడి ఫామ్‌హౌస్ వ‌ద్ద రెక్కీ నిర్వ‌హించారు. ఆయ‌న‌ను భ‌య‌పెట్టాల‌నే ఉద్దేశంతోనే ఈ కాల్పులు జ‌రిపారు. సల్మాన్ ను హ‌త్య చేయాల‌నే ఉద్దేశంతో కాదు. ఇద్ద‌రు నిందితుల కుటుంబాల వాంగ్మూలాలు బిహార్‌లో న‌మోదు చేశాం. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఏడుగురిని పిలిపించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి" అని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒక‌రు చెప్పారు.

More Telugu News