lorry driver: హైదరాబాద్ లో ఓ బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ.. వీడియో వైరల్

  • లారీని ఆపేందుకు ఓ యువకుడు క్యాబిన్ పై నిల్చున్నా ఆపని డ్రైవర్
  • దాదాపు 2 కిలోమీటర్ల వరకు వెళ్లాక ఓ కారును సైతం ఢీకొట్టిన లారీ
  • పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • బైకర్, లారీపై నిల్చున్న వ్యక్తి సేఫ్
lorry driver hits a bike and drags it underneath for 2 kms

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సమీపంలో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ బైక్ రైడర్ ను ఢీకొట్టడమే కాకుండా ఆపకుండా బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు.  దాదాపు 2 కిలోమీటర్లపాటు దూసుకెళ్లి అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఎట్టకేలకు లారీ డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్లై ఓవర్ దిగే  క్రమంలో..

చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న ఓ లారీ.. ఒవైసీ ఫ్లై ఓవర్ దిగే సమయంలో ఓ బైక్ ను శనివారం అర్ధరాత్రి ఢీకొట్టింది. లారీ ముందు చక్రాల కింద బైక్ ఇరుక్కుపోయింది. దీంతో బైక్ పై ఉన్న మాజిద్ అనే యువకుడు కిందపడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి పెద్దగా గాయాలేవీ కాలేదు. వెంటనే అక్కడున్న స్థానికులు మాజిద్ ను పైకి లేపి లారీ డ్రైవర్ ను కిందకు దిగాలంటూ గట్టిగా అరిచారు.

భయంతో లారీని పోనిచ్చి..
దీంతో  భయపడిన లారీ డ్రైవర్ బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. అతన్ని అడ్డుకునేందుకు ఓ యువకుడు లారీ ఎడమ వైపు ఉన్న క్యాబిన్ పైకి ఎక్కి నిల్చున్నా లారీ డ్రైవర్ లెక్క చేయలేదు. రోడ్డుపై రాపిడికి బైక్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. కొంత దూరం వెళ్లాక లారీ కింద ఇరుక్కున్న బైక్ పక్కకు పోవడంతో లారీ డ్రైవర్ మరింత స్పీడ్ గా నడిపాడు. బైక్ పై లారీని వెంబడిస్తున్న మరో ఇద్దరు యువకులు సెల్ ఫోన్ లో ఈ వీడియోను రికార్డు చేశారు. అలా దాదాపు 2 కిలోమీటర్లు దూసుకెళ్లాక ఓ కారును ఢీకొట్టి లారీ ఆగిపోయింది.

రిమాండ్ కు తరలింపు
అనంతరం స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. లారీ క్యాబిన్ పై నిలబడిన వ్యక్తికి సైతం గాయాలేవీ కాలేదు. అతను దిగి వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ను పృథ్వీరాజ్ గా గుర్తించామని.. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఐఎస్ సదన్ పోలీసులు తెలిపారు. అయితే క్యాబిన్ పై నిల్చున్న వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

More Telugu News