Narendra Modi: తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

  • ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదన్న ప్రధాని
  • అన్ని వర్గాల అభివృద్ధికి ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమని వ్యాఖ్య
  • ఎన్డీయే అభ్యర్థులకు లేఖ ద్వారా ప్రజలకు తన సందేశం పంపిన మోదీ
PM Modi writes letter to NDA candidates ahead of first phase of Lok Sabha polls

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. మరింత మెరుగైన జీవితాన్ని అందించాలనే మా లక్ష్యంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవి కాబోతున్నాయి. ఈ ఎన్నికలు అందరి కోసం’’ అని లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

‘‘మన వర్తమానాన్ని ఉజ్వల భవిష్యత్తుతో అనుసంధానించడానికి ఈ ఎన్నికలు ఒక చక్కటి అవకాశం. ఎన్డీయేకి పడే ప్రతి ఓటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడుతుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే మా లక్ష్యానికి ఈ ఎన్నికలు ఊపు ఇస్తాయి. ఎన్నికల్లో కీలకమైన ఈ సమయంలో మీరు (అభ్యర్థులు), పార్టీ శ్రేణులు చక్కగా ప్రచారం చేయండి. సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి’’ అని సూచించారు.

‘‘మీ ఆరోగ్యాన్ని, మీతోపాటు ఉండే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలని అభ్యర్థుల్ని కోరుతున్నాను. తీవ్రమైన ఎండలు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని. కాబట్టి ఎండ తీవ్రత పెరగకముందే ఉదయాన్నే ఓట్లు వేయాలంటూ ఓటర్లకు చెప్పండి. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతుందనే నా సందేశాన్ని ఓటర్లకు చేరవేయండి. నా సహచర అభ్యర్థులు అందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను’’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు.

కాగా ఆయా నియోజక వర్గాల్లో ప్రధాని మోదీ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే బీజేపీ వ్యూహంలో భాగంగా ప్రధాని ఈ లేఖలు రాశారు. మరోవైపు ప్రధాని లేఖ ద్వారా అందించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అభ్యర్థులు చెబుతున్నారు.

More Telugu News