Jos Buttler: వారెవా బట్లర్‌.. కోల్‌కతాపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ

  • చివరి బంతికి విజయం సాధించిన రాజస్థాన్
  • 60 బంతుల్లో 107 పరుగులతో వీరోచిత శతకం బాదిన స్టార్ బ్యాటర్
  • ఉత్కంఠభరిత పోరులో ఘనవిజయం
Buttler unbeaten 107 helps Rajasthan Royals to beat Kolkata Knight Riders by two wickets

ఆరు వికెట్లు కోల్పోయి.. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కొట్టాల్సిన స్థితిలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం ఖాయమని అంతా భావించారు. కానీ రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. విజయం తమదేనని భావించిన కోల్‌కతా ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వీరోచిత శతకంతో చెలరేగిన బట్లర్ హై స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతికి తన జట్టుని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసి కోల్‌కతా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. 

గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన 60 బంతుల్లో 107 పరుగులు బాది చివరి వరకు క్రీజులో ఉన్నాడు. ఏకంగా 9 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. బట్లర్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (34), పావెల్‌ (26) రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఆరంభంలో రాజస్థాన్ కీలక బ్యాటర్లు జైస్వాల్‌ (19), సంజు శాంసన్‌ (12) తక్కువ స్కోర్లకే పెవిలియ‌న్ చేరారు. బట్లర్, రియాన్ పరాగ్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిగ్గారు. ఆ తర్వాత పరాగ్ ఔటవడంతో తర్వాత ఆ జట్టు కష్టాల్లో పడ్డట్టు అనిపించింది. అయినప్పటికీ జాస్ బట్లర్ పట్టువదలకుండా రాజస్థాన్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరిలో ధ్రువ్‌ జురెల్‌ (2), అశ్విన్‌ (8), హెట్‌మయర్‌ (0) నుంచి సహకారం లేకపోయినప్పటికీ అద్భుతంగా పోరాడి తన జట్టుని గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు, వైభవ్ అరోరా ఒక వికెట్ చొప్పున తీశారు.

బట్లర్ విరోచిత పోరాటంతో కోల్‌కతా బ్యాటర్ సునీల్‌ నరైన్‌ (109) అద్భుత సెంచరీ వృథాగా పోయింది. కోల్‌కతా బ్యాటర్లలో ఇతరులు పెద్దగా రాణించకపోయినా నరైన్‌ విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లోనే 109 పరుగులు బాదాడు. ఇందులో 13 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రఘువంశీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (11), రసెల్‌ (13), రింకు సింగ్‌ (20 నాటౌట్‌) చొప్పున పరుగులు చేశారు.

More Telugu News