Mallu Bhatti Vikramarka: ప్రభుత్వం కూలేటట్టు ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మల్లు భట్టివిక్రమార్క కౌంటర్

  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్న ఉపముఖ్యమంత్రి
  • బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని వ్యాఖ్య
  • ప్రభుత్వం కూలిపోతుందని పదేపదే అనడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారన్న భట్టివిక్రమార్క
  • బీఆర్ఎస్‌లో ఇమడలేక కొంతమంది కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న ఉపముఖ్యమంత్రి
Mallu BhattiVikramarka counter to kcr

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండేట్లు లేదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొని, పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యపై స్పందిస్తూ... తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని... ఉనికి కోసమే ఆ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పెడుతోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కూలిపోతుందని పదేపదే అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ వ్యాఖ్యలను తప్పు బడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోవడం వల్లనే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు అంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎక్కడా కరెంట్ కోతలు లేవన్నారు.

సర్వేల్లో బీఆర్ఎస్‌కు ఒకటి రెండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ పార్టీకి వచ్చే ఒకటి రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ మాయమాటలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌కు దళితబంధుపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ పథకాన్ని తీసుకువచ్చినా నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా తాము మోసం చేయమన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని... అయిదేళ్లలో అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆదరిస్తుందని భట్టివిక్రమార్క అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు.

More Telugu News