Hyderabad: వారు మినహా... ఎన్నికల శిక్షణకు హాజరుకానివారిపై ఎఫ్ఐఅర్ నమోదు చేస్తాం: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి

  • అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణీలను మినహాయించి శిక్షణకు హాజరుకాని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడి
  • 23 వేల మందిని శిక్షణ కోసం ఎంపిక చేస్తే 3700 మంది గైర్హాజరైనట్లు తెలిపిన రొనాల్డ్ రాస్
  • 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు వెల్లడి

ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 23వేల మంది సిబ్బందిని శిక్షణ కోసం ఎంపిక చేశామని, ఇందులో 3700 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణీలను మినహాయించి శిక్షణకు హాజరు కాని మిగిలిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.

ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు... ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉంటే పత్రికల్లో ప్రచురించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ అర్బన్ జిల్లాలో 45 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయిందని... ఈసారి అవగాహన కార్యక్రమాలతో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

More Telugu News