తండ్రి, ఇద్ద‌రు కుమారుల‌కు కిడ్నీల్లో రాళ్లు!

Related image

* ఒకే కుటుంబంలో ముగ్గురికీ స‌మ‌స్య‌

* తాజాగా చిన్న కుమారుడికి తొల‌గింపు

* ఎప్ప‌టిక‌ప్పుడు పిల్ల‌ల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు చేయించాలి

* ఏఐఎన్‌యూ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ దీప‌క్ రాగూరి సూచ‌న‌

 హైద‌రాబాద్, ఏప్రిల్ 27th, 2024: కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డ‌టం అనేది స‌ర్వ‌సాధార‌ణంగానే చూస్తుంటాం. కానీ ఒకే కుటుంబంలో తండ్రికి, ఇద్ద‌రు కుమారుల‌కు కూడా అదే స‌మ‌స్య ఉండ‌టం కొంత అరుదుగానే సంభ‌విస్తుంది. న‌గ‌రానికి చెందిన ఓ కుటుంబంలో స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఈ విష‌యాన్ని న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ)కి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ దీప‌క్ రాగూరి తెలిపారు. ఆయ‌న వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..

 “ఆ కుటుంబంలో తండ్రికి, 13 ఏళ్ల వ‌య‌సున్న పెద్ద కుమారుడికి గ‌తంలో కిడ్నీల‌లో రాళ్లు తొల‌గించ‌గా, 9 ఏళ్ల వ‌య‌సున్న చిన్న కుమారుడికి కూడా ఇప్పుడు  రాళ్లు ఏర్ప‌డ‌టంతో అత్య‌వ‌స‌రంగా శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. పైపెచ్చు, ఆ బాలుడికి ఎడ‌మ‌వైపు మూత్ర‌పిండంలో ఒక‌టి, మూత్ర‌నాళంలో మ‌రొకటి రాళ్లు ఉన్నాయి. దాంతో తీవ్ర‌మైన నొప్పి రావ‌డంతో వెంటనే శ‌స్త్రచికిత్స చేసి తొల‌గించాల్సి వ‌చ్చింది. కుడివైపు కూడా అత‌డికి నొప్పి మొద‌లైంది. చూస్తే అక్క‌డ కూడా రాయి ఉంది. అయితే సాధార‌ణంగా ఒకేసారి రెండువైపులా కిడ్నీలో రాళ్లు తొల‌గించం. అందువ‌ల్ల దానికి మ‌రోసారి చేయాల్సి ఉంటుంది. దీన్ని వార‌సత్వం అని చెప్ప‌లేము గానీ, కుటుంబంలో ఎవ‌రికైనా ఈ స‌మ‌స్య ఉంటే మాత్రం కొంచెం అప్ర‌మ‌త్తం కావ‌డం మంచిది” అని చెప్పారు.

పిల్ల‌ల‌కు ఒక‌సారి కిడ్నీలో రాళ్లు వ‌స్తే, త‌ర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన స‌మ‌యంలో వైద్య ప‌రీక్ష‌లు చేయించాల‌ని డాక్ట‌ర్ రాగూరి సూచించారు. స‌మ‌గ్ర మెట‌బాలిక్ ఎవాల్యుయేష‌న్ చేయిస్తే, చికిత్స చేయ‌ద‌గ్గ కార‌కాల‌ను నివారించ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. పిల్ల‌ల‌కు ఆహారం విష‌యంలో నియంత్ర‌ణ‌లు పెట్ట‌లేమ‌ని, ఎదిగే వ‌య‌సులో వారికి అన్నిర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌ని అన్నారు. దానికితోడు ఆట‌పాట‌ల్లో మునిగిపోయే పిల్ల‌లు నీళ్లు కూడా అంత‌గా తాగ‌ర‌ని తెలిపారు.

 
ఒక‌వేళ పిల్ల‌ల‌కు కిడ్నీలో రాళ్లు ఉన్న‌ట్లు గుర్తిస్తే, త‌ర్వాత వైద్యులు చెప్పినట్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో-అప్ చేయించాల‌ని సూచించారు. దానివ‌ల్ల యూరిక్ అమ్లం అధికంగా ఉన్నా, లేదా పారాథైరాయిడ్ హార్మోన్ కార‌ణంగా కాల్షియం డిపాజిట్లు అధికంగా ఉన్నా తెలుస్తుంద‌ని, వాటికి చికిత్స చేయొచ్చ‌ని వివ‌రించారు.

More Press Releases