మలయాళం నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమానే 'డీయస్ ఈరే'. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు.అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా, 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

కథ: రోహన్ ( ప్రణవ్ మోహన్ లాల్) ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి శంకర్ రావు పెద్ద బిజినెస్ మేన్. తల్లిదండ్రులు అమెరికాలో ఉండటంతో, బంగ్లాలో రోహన్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి 'కణి' (సుస్మిత భట్) సూసైడ్ చేసుకుందని తెలుస్తుంది. గతంలో ఆమెతో ఉన్న సంబంధం కారణంగా రోహన్ కాస్త కలవరపాటుకు గురవుతాడు. 

 'కణి' ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియక పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్లిన రోహన్, ఆమె గదిలో కనిపించిన ఒక హెయిర్ క్లిప్ ను యథాలాపంగా చేతిలోకి తీసుకుంటాడు. కణి తమ్ముడు కిరణ్ కి ధైర్యం చెప్పి, అనుకోకుండానే ఆ హెయిర్ క్లిప్ ను ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అతనికి భయాన్ని కలిగించే సంఘటనలు జరగడం మొదలవుతాయి. 'కణి' ప్రేతాత్మగా మారి ఇదంతా చేస్తుందని అతను భావిస్తాడు. 

'కణి' ఇంటి పక్కనే మధుసూదన్ ఇల్లు ఉంటుంది. కొన్ని తరాలుగా ఆ కుటుంబం తాంత్రిక విద్యలపై ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. రోహన్ కి సహాయ పడాలని అతను నిర్ణయించుకుంటాడు. అయితే తనకి కనిపించిన ఆకారం పురుషుడు మాదిరిగా ఉందనీ, కాళ్లకి గజ్జెలు ఉన్నాయని రోహన్ చెబుతాడు. అప్పుడు మధుసూదన్ ఎలా స్పందిస్తాడు? ఇద్దరూ కలిసి ఏం చేస్తారు? ప్రేతాత్మగా మారి రోహన్ పై దాడి చేస్తున్నది ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్లు .. మర్డర్ మిస్టరీలు .. హారర్ థ్రిల్లర్లను ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ ముందుంటారు. పరిమితమైన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ను అందించడంలో వాళ్లు తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. అందువల్లనే ఈ జోనర్ కి చెందిన మలయాళ సినిమాలు చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులంతా కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రణవ్ మోహన్ లాల్ చేసిన ఈ సినిమా కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తుంది.

భయపెట్టడం కోసం దర్శకుడిగా చేసిన ప్రయత్నంగానే కాదు, ఒక ప్రయోగంగా ఈ సినిమాను చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధానమైనవిగా రెండే పాత్రలు కనిపిస్తాయి. మిగతా రెండు కీలకమైన పాత్రలకు సంబంధించిన ఫొటోలు తప్ప ఆర్టిస్టులు తెరపైకి రారు. ఇక మిగతా పాత్రలు ఇలా వచ్చేసి అలా వెళ్లిపోతూ ఉంటాయి. తెరపై దెయ్యాన్ని చూపించకుండా .. తాంత్రిక పూజల హడావిడి లేకుండా టెన్షన్ పెట్టడమే ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 

ప్రేతాత్మను బంధించబడటం .. ఎవరి కారణంగానో అది బయటికి రావడం .. ప్రతీకారం తీర్చుకోవడం వంటి రెగ్యులర్ ఫార్మేట్ లో ఈ సినిమా ఉండదు. చివరి 30 నిమిషాలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ సినిమా  కొనసాగుతుంది. ఇక్కడి నుంచి కథ కొత్త మలుపు తీసుకోవడమే కాకుండా, రెగ్యులర్ ఫార్మేట్ కి భిన్నంగా అనిపిస్తుంది. చివరి అరగంట ఎపిసోడ్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చుతుందని చెప్పచ్చు.

పనితీరు: దెయ్యాల సినిమాలకు భారీ స్థాయిలో ఖర్చు చేయడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అలాగే ఒక రేంజ్ లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తూ ఉండటం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అలాంటివేమీ కనిపించవు. ఎంచుకున్న సింపుల్ లైన్ ను బలంగా చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుందనిపిస్తుంది. 'డీయస్ ఈరే' అంటే లాటిన్ భాషలో 'శిక్షా దినం' అనే అర్థం ఉందని చెప్పారు. కథలో అందుకు సంబంధించిన ప్రస్తావన కూడా వస్తుంది.

ఇక 'కణి' తమ్ముడు గాయపడే సీన్ ను మాత్రం చాలా దారుణంగా చూపించారు. ఆ సన్నివేశాన్ని తెరపై చూడలేక తల పక్కకి తిప్పుకునే స్థాయిలో ఉంటుంది. అంత రక్తపాతాన్ని ఎందుకు చూపించారా అని అనిపిస్తుంది. నిజానికి అంత అవసరం లేదు కూడా.   

ప్రణవ్ మోహన్ లాల్ యాక్టింగ్ బాగుంది. పాత్రకి తగిన స్థాయిలోనే ఆయన నటన కనిపిస్తుంది. సా సాధారణంగా దెయ్యాల సినిమాలలో ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం రెండూ కూడా పొతే పడుతూ ఉంటాయి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఫొటోగ్రఫీ కంటే కూడా నేపథ్య సంగీతం కథకి ఎక్కువగా సపోర్ట్ చేసిందని అనిపిస్తుంది.

ముగింపు: నిజానికి ఇది చాలా సింపుల్ కంటెంట్. కథగా చెప్పుకుంటే పెద్ద ఎఫెక్టివ్ గా కూడా ఉండదు. కానీ ట్రీట్మెంట్ కారణంగా .. ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం కారణంగా ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. చివరి 30 నిమిషాలు మరింత కీలకంగా మారిపోయి, మనలను అలా కూర్చోబెట్టేస్తాయి.