శివరాత్రి రోజున దర్శించ వలసిన క్షేత్రం

మహాశివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా నదీ తీరంలో గల క్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున మారుమూల గ్రామాల్లోని శివాలయాల నుంచి ... మహా పుణ్యక్షేత్రాలలోని శివాలయాల వరకూ ఏ శివలింగాన్ని పూజించినా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది.

ఇక దేవతలే దిగి వచ్చి శివుడిని ఆరాధించిన క్షేత్రాలను ఈ సందర్భంలో దర్శిస్తే ఆ పుణ్య ఫలం మరింత విశిష్టంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అలా ముక్కోటి దేవతలు ముక్కంటిని సేవించిన పుణ్యక్షేత్రంగా మనకి 'తొండవాడ' దర్శనమిస్తుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం కనిపిస్తుంది.

శివుడి ఆదేశం మేరకు దక్షిణ భారతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఈ నేపథ్యంలో గోదావరి నదిలో ఆయన స్నానంచేస్తూ ఉండగా ఒక శివలింగం లభించిందట. ముక్కోటి దేవతలను ఆహ్వానించి ఆ శివలింగాన్ని ఆయన ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు. దాంతో దేవదేవుడు ప్రత్యక్షమై, తాను ఇక్కడ కొలువై ఉంటానని వరాన్ని ఇచ్చాడు.

అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి పాదముద్రలు పెద్ద ఆకారంలో కనిపిస్తుంటాయి. అయ్యవారితో పాటు అమ్మవారు 'ఆనందవల్లి' పేరుతో పూజలందుకుంటూ ఉంటుంది. గణపతి ... కుమారస్వామి కూడా భక్తులను అనుగ్రహించే ఈ క్షేత్రంలో పవిత్ర పుష్కరిణి ఉండటం మరో విశేషం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆదిదంపతుల అనుగ్రహంతో పాటు, ముక్కోటి దేవతల దీవెనలు లభిస్తాయని స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News