పాపాలను హరించే రామకృష్ణ తీర్థం

తిరుమల పేరు వినగానే ఏడుకొండలస్వామి దివ్యమంగళ స్వరూపం కనులముందు కదలాడుతుంది. సాధ్యమైనంత తొందరగా ఆ స్వామి సన్నిధికి చేరుకోవాలని మనసు ఆరాటపడుతుంది. తిరుమల క్షేత్రంలోకి అడుగు పెడితే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. స్వామివారిని దర్శించడానికి అధిరోహించవలసిన ఏడుకొండలు సాలగ్రామమయంగా చెబుతారు.

ఇక్కడ వున్న ప్రతి రాయి ఓ సాలగ్రామంగా చెప్పబడుతోంది కనుకనే, మెట్లదారిలో దర్శనానికి వెళ్లేవాళ్లు పాదరక్షలు లేకుండా నడుస్తుంటారు. ఇక మెట్లదారిలో వెళుతూ ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడే, స్వామి ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నది అర్థమవుతుంది. అలా స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత చాలామంది ఇక్కడి పుణ్యతీర్థాలపై దృష్టి పెడుతుంటారు.

స్వామివారి సేవలో అనునిత్యం తరించే ఆ పుణ్య తీర్థాల జాబితాలో మనకి 'ఆకాశగంగ' ... 'పాపనాశనం' ... ' పాండవతీర్థం' ... ' సనకసనందన తీర్థం' ... 'జాబాలీ తీర్థం' ... 'కుమారధార తీర్థం' ... 'చక్రతీర్థం' ... 'పసుపుధార తీర్థం' ... 'తుంబురుతీర్థం' కనిపిస్తాయి. ఇక ఇదే జాబితాలో కనిపించే మరో విశిష్టమైన పుణ్యతీర్థం ... 'రామకృష్ణ తీర్థం'.

పాపనాశనానికి సమీపంలో కనిపించే ఈ తీర్థం, మిగతా పుణ్యతీర్థాల వలెనే ఎంతో పవిత్రమైనదిగా ... మరెంతో మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. పూర్వం రామకృష్ణుడనే ఒక మహర్షి స్వామి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించాడు. అనునిత్యం ఇక్కడి తీర్థంలో స్నానం చేస్తూ స్వామిని ఆరాధించిన కారణంగా, స్వామివారు ప్రత్యక్షమై కోరిన వరాలను ప్రసాదించినట్టుగా చెబుతారు.

ఆనాటి నుంచి ఈ తీర్థం ... రామకృష్ణ తీర్థంగా పిలవబడుతోంది. భక్తుడికి భగవంతుడి అనుగ్రహం లభించేలా చేసిన కారణంగా ఈ తీర్థం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందింది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయనీ, స్వామివారి అనుగ్రహం కారణంగా సకల శుభాలు చేకూరతాయని అంటారు.


More Bhakti News