ప్రదక్షిణ ప్రారంభ దిశ

ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందుగా ప్రదక్షిణలు చేసి, ఆ తరువాతే ముఖమంటపంలోకి వెళ్లడం జరుగుతుంటుంది. ప్రదక్షిణల వలన ఆలయ వాతావరణం నుంచి అవసరమైన శక్తి లభించడమే కాకుండా, భగవంతుడి పట్ల మనకి గల విశ్వాసాన్ని ప్రకటించడానికి ... మనపట్ల ఆయనకి అభిమానం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణంగానే భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు ఆచరించే వారి కోరికలు నెరవేరుతుంటాయి.

సాధారణంగా శివాలయానికో ... వైష్ణవ ఆలయానికో ... శక్తిమాత ఆలయానికో వెళ్లి నప్పుడు ప్రదక్షిణలు ఎలా ప్రారంభించాలనే ఆలోచన రాదు. చకచకా ప్రదక్షిణలు పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లడం జరుగుతుంటుంది. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయవలసి వచ్చినప్పుడు కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంటుంది. నవగ్రహాలలో ఏ విగ్రహం నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలనే విషయమై వీళ్లు సతమతమైపోతుంటారు.

ఈ విషయంలో ఎవరికి తోచిన సలహా వాళ్లు ఇస్తుండటంతో, సమస్య మరింత గందరగోళంగా తయారవుతూ వుంటుంది. శాస్త్రంలో మాత్రం ఇందుకు సమాధానం స్పష్టంగా పేర్కొనబడింది. ప్రదక్షిణలు తూర్పు దిక్కు నుంచి ప్రారంభించాలని శాస్త్రం చెబుతోంది. సకల ప్రాణకోటికి ఆధారభూతమైన దైవం సూర్యనారాయణ మూర్తి. ఆయన వుండే దిక్కు తూర్పు కనుక ఆ వైపు నుంచే ప్రదక్షిణలు ఆరంభించాలని అంటోంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు ఆచరించడంలోను ఇదే నియమం వర్తిస్తుంది.


More Bhakti News