తిరుమలేశుడి అనుగ్రహం

తరిగొండలో ఒక వర్గానికి చెందినవారు వెంగమాంబ కీర్తి ప్రతిష్ఠలను జీర్ణించుకోలేకపోతారు. మాధవుడిని సేవించుకోవడానికి అవసరమైన మనశ్శాంతి లేకుండా వాళ్లు చేస్తూ ఉండటంతో, అ ఊరుని వదిలి వెంగమాంబ తిరుమలకు చేరుకుంటుంది. స్వామివారి అనుగ్రహంతో అక్కడి మహంతుల సహాయ సహకారాలు ఆమెకి లభిస్తాయి. దాంతో ఆమె కొండపైనే ఉంటూ స్వామిని సేవించుకోసాగింది.

వెంగమాంబ భక్తి శ్రద్ధల కారణంగా అక్కడి వారంతా ఆమెపట్ల గౌరవాభిమానాలను కలిగి ప్రవర్తించసాగారు. ఆలయంలోని ప్రధాన అర్చకులలో ఒకరికి ఈ విషయం తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది. దాంతో ఆమెను సాధ్యమైనంత త్వరగా కొండపై నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూసి, స్వామివారి నగలను వెంగమాంబ దొంగిలించిందనే అపవాదును వేస్తాడు.

ఈ కారణంగా ఆమెను కొండపై నుంచి పంపించడానికి ప్రయత్నిస్తాడు. జరుగుతున్న సంఘటనల పట్ల వెంగమాంబ తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. దాంతో స్వామివారు ప్రత్యక్షమై నిజానిజాలు తనకి తెలుసునని ఆమెను ఓదారుస్తాడు. ఇకమీదట తపస్సుకు తగిన ప్రదేశంగా 'తుంబురకోన'ను ఎంచుకోమని ఆమెకి సూచిస్తాడు.

సంతోషంతో స్వామివారి పాదాలకు నమస్కరించిన వెంగమాంబ అక్కడికి బయలుదేరుతుంది. ఇక ఆమెపై నిందవేసి బాధించిన అర్చకుడికి ఆ మరునాడే అనూహ్యమైన పరిస్థితి ఎదురవుతుంది. వెంగమాంబ విషయంలో అతను అలా ప్రవర్తించడమే అందుకు కారణమని అంతా అనుకుంటారు. ఈ సంఘటనను అసమానమైన ఆమె భక్తికి మరో మచ్చుతునకగా భావిస్తారు.


More Bhakti News