కార్తీకపౌర్ణమి విశిష్టత

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. శివుడిని ఆరాధించి ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుమించిన పవిత్రమైనరోజు ఇంకొకటి లేదని చెబుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజునే పరమశివుడు 'త్రిపురాసులను' సంహరించాడు.ఈ కారణంగానే దీనిని 'త్రిపుర పూర్ణిమ' అని కూడా పిలుస్తుంటారు.

ఈ రోజున సదాశివుడు త్రిపురాసురులను సంహరించగా, ఆయన సాధించిన విజయంపట్ల అమ్మవారు హర్షాన్ని వ్యక్తం చేస్తూ 'జ్వాలాతోరణోత్సవం' నిర్వహించిందట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికీ ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవం జరుపుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజున వివాహిత స్త్రీలు కార్తీక వ్రతం ఆచరిస్తూ వుంటారు.

మహిషాసురుడిని సంహరించే సమయంలో అమ్మవారి కారణంగా ఒక శివలింగం దెబ్బతిన్నదట. ఆ పాపపరిహారార్థం ఆమె కార్తీకపౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరిస్తూ శివుడిని ఆరాధించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకూ ఉపవాసం వుండి, ఉసిరిచెట్టు కింద దీపారాధనచేసి దీపదానం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు.

ఇక ఈ రోజు రాత్రి దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులు వేసి నేతి దీపాలు వెలిగిస్తూ వుంటారు. మరికొందరు తులసికోట దగ్గర 720 వత్తులు వెలిగిస్తూ వుంటారు. ఇక ఉసిరిచెట్టు దగ్గర లక్ష వత్తులు వెలిగించడం కూడా చేస్తుంటారు. ఇలా ఈ రోజున ఎక్కడ చూసినా దీపకాంతులు వెదజల్లబడుతుంటాయి.

పరమశివుడి శిరస్సును అలంకరించి ఆయనకి చల్లదనాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతగా భక్తులు, వెన్నెల కురిపిస్తోన్న చంద్రుడికి వేలదీపాలతో హారతిపడుతున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఈ రోజున కూడా బాణాసంచా కాలుస్తూ వుండే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటుంది. అందుకే అత్యంత పవిత్రమైన ఈ రోజుని దీపావళి తరువాత ఆ స్థాయి పండుగలా జరుపుకుంటూ వుంటారు ... ఆదిదంపతుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలను పొందుతూ వుంటారు.


More Bhakti News