బండరాయే గుడి గంట!

లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ వుంటే అక్కడ సంపదలు సమకూరతాయి ... విజయాలు చేకూరతాయి. దుష్ట ప్రయోగాలు ... అనారోగ్యాలు దరిదాపులకు రాకుండా పోతాయి. అందువల్లనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో ... పొలిమేరల్లో వెలసి, ఆదరణకి నోచుకోని క్షేత్రాలు కూడా ఎన్నో వున్నాయి.

అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కనిపిస్తూ వుంటుంది. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ల సంకీస గ్రామ పొలిమేరల్లోని గుట్టపై గల గుహలో స్వామి ఆవిర్భవించాడు. దూరం నుంచి చూడగానే ఈ గుట్ట మహిమాన్వితమైనదనే విషయం తెలిసిపోతూ వుంటుంది.

జనాదరణ అంతగా లేనికారణంగా ఈ గుట్టపైకి చేరుకోవడానికి సరైనమార్గం కూడా కనిపించదు. ముళ్లపొదలను ... పెద్దపెద్ద బండరాళ్ళను దాటుకుంటూ ముందుకి వెళ్లవలసి వుంటుంది. అలా గుట్ట పైభాగానికి చేరుకున్న తరువాత, అక్కడ ఒక గుహలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు. గుట్ట పై భాగాన పెద్ద బండరాళ్ల అమరికతో ఏర్పడిన గుహ ఎవరినైనా సరే ఆశ్చర్య చకితులను చేస్తుంది.

ఇక ఆ పక్కనే సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న కోనేరు కనిపిస్తుంది. ఇందులోగల నీరు ఎంతో స్వచ్ఛంగా వుంటుంది కానీ, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మండువేసవిలో సైతం ఎండిపోకుండా ఈ కోనేరులో నీళ్లు వుండటం విశేషం. ఇక గాలికి వచ్చే ధూళి ఈ నీటిలో పడకూడదన్నట్టుగా ఏటవాలుగా నమస్కార ముద్రలో రెండు బండరాళ్లు అడ్డుగా వుంటాయి.

గుహ ఎదురుగా ఏటవాలుగా గల రాతిబండపై అస్పష్టమైన దైవ స్వరూపం కనిపిస్తూ వుంటుంది. బహుశా ఆంజనేయస్వామి అయ్యుంటాడనీ, ఆయనే ఈ క్షేత్రానికి పాలకుడని ఊహించుకోవచ్చు. ఇక్కడ గల పొడవైన ఓ రాయిని మరో రాయితో కొడితే అచ్చు గంట మోగిన శబ్దం వస్తుంది. ఇక్కడున్న ఈ రాయి మినహా మిగతా రాళ్లన్నీ మామూలు శబ్దం మాత్రమే చేస్తాయి. గుడిలోని గంటతో సహా అన్నింటినీ సహజ సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న ఇక్కడి స్వామి మహిమాన్వితుడని భక్తులు చెబుతుంటారు.


More Bhakti News