శ్రీ ఆది వరాహస్వామి ఆలయం

తిరుమల చేరుకున్న వారు ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తరువాతే శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. శ్రీవారికంటే ముందునుంచే శ్రీ వరాహస్వామి ఇక్కడ కొలువై వున్నాడు. జ్ఞాన ప్రదాత అయిన వరాహస్వామిని శ్రీనివాసుడికి గురువుగా చెబుతుంటారు. గురువు ద్వారా దైవానుగ్రహాన్ని సంపాదించడం తేలిక అవుతుంది కనుక, ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడం చేస్తుంటారు.

ఇక ఇక్కడ స్వామి ఉనికి బయటపడిన తీరు అత్యంత ఆసక్తికరంగా వుంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో నివసించే కొండజాతి వారు జంతువులను వేటాడుతూ తమ జీవనాన్ని కొనసాగించే వారు. ఓ రోజున ఓ వేటగాడు అడవి పందిని తరమడం ప్రారంభించాడు. అది చిక్కకపోవడంతో పట్టుదలతో దానిని వెంబడించాడు. అది ఓ పుట్టలోకి దూరి అదృశ్యం కావడంతో, దాని కోసం ఆ వేటగాడు వెదకడం మొదలుపెట్టాడు.

ఆ సమయంలోనే వరాహస్వామి ఆ వ్యక్తికి దర్శనమిచ్చాడు. భయంతో కంపించి పోతున్న ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాడు. తాను కనిపించిన ప్రదేశాన్ని కపిలగోవు పాలతో శుద్ధి చేయించి, అక్కడ ఆలయాన్ని నిర్మించవలసిందిగా చక్రవర్తి అయిన తొండమానుడితో తన మాటగా చెప్పమని అన్నాడు. అలాగే తన మూలమూర్తి ఎలా ఉండాలనే విషయాన్ని కూడా వివరించాడు. అలాగే ఆ పక్కనే గల మరోపుట్టలో శ్రీనివాసుడు వున్నాడనే విషయాన్ని చెప్పాడు. ఆ స్వామి ఆలయాన్ని ఆయన అభిరుచికి తగినట్టుగానే నిర్మించమని అన్నాడు.

ఈ విషయాలన్నీ చెప్పి స్వామి అదృశ్యం కావడంతో, జరిగిందంతా ఒకసారి ఆ వ్యక్తి గుర్తుచేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి వెంటనే ఈ ప్రదేశానికి చేరుకొని ఆ స్థల మహాత్మ్యాన్ని గుర్తించాడు. అటు శ్రీనివాసుడికి ... ఇటు వరాహస్వామికి ఆలయాలు నిర్మించాలనే ఆలోచనకు ఆ క్షణంలోనే శ్రీకారం చుట్టాడు. అలా ఇక్కడ నిర్మించబడిన ఆలయంలో వరాహస్వామి, లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తూ వుంటాడు.

శ్రీవారి వంటశాల నుంచే స్వామివారికి కావలసిన నైవేద్యాలు అందుతూ వుంటాయి. ఆదివరాహస్వామిని దర్శించడం వలన జ్ఞానం లభిస్తుందని చెబుతుంటారు. భగవంతుడిని దర్శించడానికి కావలసినది జ్ఞానమే కాబట్టి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించే ఆదివరాహస్వామిని అనుదినమూ పూజించాలి ... అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించాలి.


More Bhakti News